ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట సుఖాలు..రెండూ ఉంటాయి. అయితే కొందరి జీవితాలో మాత్రం కష్టాలు మాత్రమే ఎక్కువగా ఉంటాయి. అయితే తమకే ఎందుకు ఇలా కష్టాలు ఎక్కువగా వస్తున్నాయని, తమ జీవితామే వ్యర్థమని చాలా మంది భావిస్తుంటారు. కొందరు కష్టాలతో కూడిన జీవితం కంటే చావడం మేలు అనే భావనలోకి వెళ్తుంటారు. కానీ కొందరు మాత్రం సమస్యలతోనే సావాసం చేస్తూ..వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. కష్టాలే తమను చూసే పారిపోయేలా చేసి.. జీవితంలో విజేతలుగా నిలబడతారు. అలా తమ జీవితాల్లోని చీకటిని పారద్రోలి.. వెలుగు నింపుకుంటూ.. ఇతరలు జీవితాన్నికి కూడా వెలుగును ప్రసాదిస్తారు. ఆ కోవాకు చెందిన వ్యక్తే సీహెచ్ నాగేశ్ పాత్ర్. ఒడిశాకు చెందిన ఇతను ఉదయం ఉపాధ్యాయుడిగా మారి.. సాయంత్రం రైల్వే కూలీగా పనిచేస్తాడు. అతడు ఇలా కష్ట పడటానికి ఓ బలమైన కారణం ఉంది. మరీ ఆయన జీవిత విశేషాలు ఏమిటో ఇప్పుుడు తెలుసుకుందాం..
ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా మనోహర్ గ్రామానికి చెందిన సీహెచ్ నాగేశ్ పాత్ర్ కొన్నేళ్ల క్రితం పదో తరగతి వరకు చదివి.. ఇంటర్ మధ్యలో ఆపేశాడు. ఆ తరువాత వేరే రాష్ట్రాలకు వెళ్లి.. ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అయితే అక్కడ సరైన ఉపాధి లేక తిరిగి సొంత గ్రామానికి చేరుకున్నాడు. ఈక్రమంలోనే రైల్వే కూలీ ప్రకటను రావడం చూసి.. దానికి దరఖాస్తు చేసుకోవడంతో ఉద్యోగం సాధించాడు. అయితే తాను చదివిన చదువుకు మంచి ఉద్యోగం రాదని నాగేశ్ భావించాడు. ఇంకా ఉన్నత చదువులు చదివి.. మంచి ఉద్యోగం సాధించాలని భావించాడు.
ఈక్రమంలోనే పని చేసుకుంటూ పీజీ వరకు చదువుకున్నాడు. రెండేళ్ల క్రితం కోవిడ్ కారణంగా రైళ్లు నిలిపివేయడంతో నాగేష్ ఖాళీగా మారాడు. అదే సమయంలో తాను చదివిన చదువును , కాలాన్ని వృథాగా పోనివ్వకూడదని భావించాడు. పేద విద్యార్ధులకు ఉచితంగా చదువు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కొణిసి అనే గ్రామంలో ఓ శిక్షణ కేంద్రం తెరిచి చిన్నారులకు పాఠాలు చెప్పేవాడు నాగేశ్. ఇలా చెప్తూ ఉండగా కోవిడ్ ఆంక్షలు ఎత్తి వేయడం.. రైళ్లు తిరిగి ప్రారంభం కావడం జరిగింది. దీంతో మళ్లీ పనికి వెళ్లడం ప్రారంభించాడు. అయితే తన కారణంగా పిల్లల చదువులు మధ్యలో ఆగి పోకూడదని నాగేశ్ భావించాడు. దీంతో ఉదయం ఉపాధ్యాయుడిగా మారి పిల్లలకు పాఠాలు చెప్పి.. సాయంత్రం రైల్వేకూలీగా మారేవాడు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కళాశాలలో బోధన, రాత్రి 8 గంటల నుంచి తెల్లవారే వరకు స్టేషన్ లో కూలీగా పని చేసేవాడు. అంతేకాక ఆక్కడ మరొ ఆరుగురిని టీచర్లగా నియమించాడు. వారికి జీతాలు ఇచ్చేందుకు ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చర్ గా చేరాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడమే తన లక్ష్యమని నాగేశ్ తెలిపాడు. ఇలా తాను పిల్లలకు పాఠాలు బోధిస్తూ..వారి కోసం పనిచేసేవారికి జీతాలు ఇచ్చేందుకు రేయింబవళ్లు నాగేశ్ కష్టపడుతున్నాడు. ఎవరు ఎలా పోతే మాకేంటి..మా జీవితమే మాకు ముఖ్యం అనుకునే ఈ రోజుల్లో..తాను ఇబ్బంది పడుతూ కూడా పేద పిల్లల భవిష్యత్ కోసం నాగేశ్ కష్ట పడుతున్నాడు. ఇతడి జీవితం ఎందరికో ఆదర్శం.