వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు ఓట్ ఫ్రమ్ హోమ్ ఎందుకు ఉండకూడదు అని ఎప్పుడైనా అనిపించిందా? తినే ఫుడ్డు, పడుకునే బెడ్డు, వేసుకునే బట్టలు, కూరగాయలు, పండ్లు ఇలా బయటకు వెళ్లే పని లేకుండా ఆన్ లైన్ లో ఆర్డర్ పెడితే ఇంటికే వచ్చేస్తున్నాయి. మరి అలాంటప్పుడు ఓటు ఎందుకు ఇంటి నుంచి వేయకూడదు అని అనిపించిందా? పన్నుల నుంచి జీతం ఇచ్చేది మనం అయితే.. మన దగ్గరకు వచ్చి ఓటు వేయించుకోవాలి కదా అని అనిపించిందా? అయితే ఎన్నికల సంఘం ఓట్ ఫ్రమ్ హోమ్ అనే విధానాన్ని తీసుకొచ్చింది.
ఓటు అనేది మనుషుల తలరాతలను మార్చే ఆయుధం. అయితే అలాంటి ఓటు వేయాలంటే క్యూలో నిలబడాల్సి వస్తుంది. కొంతమందికి ఇలా నిలబడి వేయడం అవసరమా? అని అనిపిస్తుంది. మండుటెండలో నిలబడి, కాళ్ళు నొప్పులు పుట్టేలా నిలబడాలంటే కష్టంగా భావిస్తారు. టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినప్పుడు ఇంటి నుంచే ఓటు వేసే టెక్నాలజీని తీసుకురావచ్చు కదా అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? టెక్నాలజీ సంగతి ఏమో గానీ ఇంటి నుంచే ఓటు వేసేలా అవకాశం కల్పిస్తుంది ఎన్నికల సంఘం. అంటే ఓటు వేయడం కోసం పోలింగ్ బూత్ దగ్గరకు వెళ్లి క్యూలో నిలబడాల్సిన పని ఉండదు. ఎండలో నిలబడాల్సిన అవసరం అంతకంటే ఉండదు.
భారత కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. మే 24తో కర్ణాటక అసెంబ్లీ పదవీకాలం ముగియనుండటంతో భారత ఎన్నికల సంఘం ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబందించి ఎన్నికల తేదీలను ఇవాళ ఉదయం 11.30 గంటలకు ప్రకటించింది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2.59 కోట్లు మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లలో వందేళ్లు పైబడిన వారు 16,976 మంది ఉండగా.. థర్డ్ జెండర్లు మరియు మొదటిసారి వేస్తున్న ఓటర్లు కలిపి 9.17 లక్షలు మంది ఉన్నారని భారత ఎన్నికల సంఘం తెలిపింది.
గత వారం కాంగ్రెస్ పార్టీ 124 అభ్యర్థులకు సంబంధించిన మొదటి జాబితాను విడుదల చేసింది. ఇక బీజేపీ కూడా తమ అభ్యర్థులను ఏప్రిల్ మొదటి వారంలో ప్రకటిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం వెల్లడించారు. ఇక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్ 13న ఉంటుందని, మే 10న ఒకే విడతలో పోలింగ్ జరుగుతుందని, మే 13న కౌంటింగ్ ఉంటుందని తెలిపింది భారత ఎన్నికల సంఘం తెలిపింది. ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని తెలిపింది. నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 20గా, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 24గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే తొలిసారిగా ఓటు ఫ్రమ్ హోమ్ పద్ధతిని అమలు చేస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఈ విధానం కేవలం సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు మాత్రమేనండోయ్. 80 ఏళ్ళు పైబడ్డ వారు, దివ్యాంగులు పోలింగ్ బూత్ కి వచ్చి అంతసేపు నిలబడి ఓటు వేయలేరు కాబట్టి.. వారి కష్టాన్ని తగ్గించి ఇంటి నుంచే ఓటు వేసేలా భారత ఎన్నికల సంఘం అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే ఎన్నికల సంఘం తరపున వాలంటీర్లు ఇంటింటికీ వచ్చి దివ్యాంగులు, 80 ఏళ్ళు పైబడిన వృద్ధులతో ఓట్లు వేయిస్తారన్నమాట. ఇది అక్కడ విజయవంతమైతే మిగిలిన రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. మరి భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఓట్ ఫ్రమ్ హోమ్ విధానంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.