ఈ మధ్య గిరిజన యువకుడిపై మూత్రవిసర్జన చేసిన ఘటన మరువక ముందే మరో దళిత యువకుడితో తన కాలుకున్న చెప్పులను నాకించాడు. ఈ వీడియో నట్టింట చక్కర్లు కొడుతుంది.
ఒక్కోసారి మనం మనుషుల మధ్యే జీవిస్తున్నామా అనిపిస్తుంది. నేటి సమాజంలో చాలామంది మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు. దురహంకారంతో అగ్రవర్ణాలవారు చేస్తున్న దురాగతాలకు అంతులేకుండా పోతోంది. దళతులను, గిరిజనులను అవమానించి పైశాచికానందాన్ని పొందుతున్నారు. ఈ మధ్య మానసిక పరిస్థితి సరిగా లేని ఓ గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటన మరువక ముందే ఉత్తర ప్రదేశ్‌లో ఓ దళిత యువకుడితో చెప్పులను నాకించాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఈ ఘటనను అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్త వైరల్ అయింది. నిందితులనిపై పోలీసులు SC,ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌లో గిరిజన జాతికి చెందిన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటన దేశం మొత్తం సంచలనం రేపింది. అదే తరహాలో మరో ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ దళితునిపై అమానవీయ ఘటన జరిగింది. తేజ్‌పాల్ సింగ్ అనే వ్యక్తి విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌గా పని చేస్తున్నాడు. తను మంచంపై కూర్చుని రాజేంద్ర అనే దళిత యువకుడితో తన కాలి చెప్పును నాకమని ఆదేశించాడు. దీంతో ఆగకుండా అతనితో గుంజీలు తీయించాడు. ఆ దళితుడు తేజ్‌పాల్ సింగ్ చెప్పినట్లు చేస్తున్నాడు.
అసలు ఎందుకు ఇలా చేయించాడో తెలియదు కానీ.. ఇదంతా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలోకి వదిలారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన పోలీసులు తేజ్‌పాల్ సింగ్‌పై SC,ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి అయిఉండి ఈ అనాగరిక చర్యలకు ఎందుకు పాల్పడుతున్నాడో పోలీసులు ఆరా తీస్తున్నారు.