ప్రమాదాలు ఎప్పుడు చెప్పిరావు. వచ్చిన తర్వాత.. అవి ఎలాంటివైనా, ఎంతటి పరిస్థితులకు దారి తీసినా ఎదుర్కొవాల్సిందే. ఒక్కోసారి ప్రాణాలతో భయపడితే.. కొన్ని సార్లు మరణానికి తలొంచాల్సి వస్తుంది.
ప్రమాదాలు ఎప్పుడు చెప్పిరావు. వచ్చిన తర్వాత.. అవి ఎలాంటివైనా, ఎంతటి పరిస్థితులకు దారి తీసినా ఎదుర్కొవాల్సిందే. ఒక్కోసారి ప్రాణాలతో భయపడితే.. కొన్ని సార్లు మరణానికి తలొంచాల్సి వస్తుంది. విధి రాత అనాలో, నిర్లక్ష్యమో తెలియదు కానీ ప్రమాదాలు ఎంతటి విపత్తును కల్గిస్తాయో ఊహించడం కష్టం. మంచి ఉద్యోగం, బంగారం లాంటి పిల్లలు. హాయిగా సాగిపోతున్న జీవితం ఆమెది. పిల్లల్ని తీసుకుని యాత్రకు బయలు దేరారు. కానీ హఠాత్ పరిణామం ఆ పిల్లలకు తల్లిని దూరం చేసింది. అయితే ఆమెకు జరిగిన ప్రమాదంలో తృటిలో పిల్లలు ప్రాణాపాయం నుండి తప్పించుకోవడం కాస్త ఉపశమనం. ఇంతకు ఆమెకు ఏం అయ్యిందంటే..?
తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్‌కు సాక్షి అహుజా లక్ష్మీనగర్‌లోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. విహార యాత్ర నిమిత్తం కుటుంబంతో కలిసి వందే భారత్ రైల్లో చండీగఢ్ వెళ్లేందుకు ఆదివారం ఉదయం 5.30 గంటలకు న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. తల్లిదండ్రులు, సోదరుడు కారు పార్కింగ్ చేస్తుండగా.. సాక్షి, ఆమె పిల్లలు, సోదరి కారు దిగి..స్టేషన్ లోపలికి వెళ్తున్నారు. అయితే ఆమె స్టేషన్‌కు వెళుతున్న మార్గంలో వాన నీరు చేరింది. అందులో నుండి నడిచి వెళ్తున్న సాక్షి..పట్టు తప్పి పక్కనే ఉన్న కరెంట్ స్థంభాన్ని తాకింది. అయితే అప్పటికే దానికి విద్యుత్ పాస్ కావడం వల్ల ఆమెకు కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది.
సాక్షిని రక్షించే ప్రయత్నంలో ఆమె సోదరి మాధవిని కూడా విద్యుదాఘాతానికి గురైంది. సాక్షిని రక్షించేందుకు ఆటో, క్యాబ్ డ్రైవర్లు ప్రయత్నించినా అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది. అయితే మృతురాలి పిల్లలు త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మాధవిని, సాక్షి పిల్లల్ని ట్యాక్సీ డ్రైవర్లు వెనక్కు లాగడంతో తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొంత మంది డ్రైవర్లు కూడా కరెంట్ షాకుకు గురయ్యారని, బెడ్ షీట్లు, టవల్స్, కర్ర సాయంతో సాక్షిని లాగారని, ఆసుపత్రికి తీసుకెళితే.. చనిపోయినట్లు వైద్యులు చెప్పారన్నారు. కొంత దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నా ఏ ఒక్కరూ సాయం చేయడానికి రాలేదని అన్నారు.