ప్రేమించిన అమ్మాయితో గొడవ పడ్డ ఓ 28 ఏళ్ల డాక్టర్.. ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారుకు నిప్పంటిన ఘటన తమిళనాడులోని కాంచీపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ధర్మపురికి చెందిన కవిన్ గత ఏడాది కాంచీపురంలోని ఓప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఓ ప్రైవేటు ఆసుప్రతిలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. అయితే అదే కాలేజీకి చెందిన కావ్యను ప్రేమించాడు. మనస్పర్థల కారణంగా గత కొన్ని రోజులుగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. దీంతో అతడు డిప్రెషన్ లోకి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గురువారం రాత్రి కావ్యను తన కారులో ఎక్కించుకుని కాంచీపురం జిల్లాలోని రాజకులంలో సరస్సు సమీపంలోని ఏకాంత ప్రాంతానికి తీసుకెళ్లాడు. మాటల్లో వారి మధ్య గొడవ మొదలు కావడంతో ఒక్కసారిగా కోపం పెంచుకున్న కవిన్, 50 లక్షల విలువ చేసే తన మెర్సిడెస్ బెంజ్ కారుపై పెట్రోల్ పోసి, నిప్పంటించాడు. కావ్య అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. వినలేదు. కాగా, అటుగా వెళ్లిన వారు మంటలు రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అగ్ని మాపక సిబ్బందిని ఘటనాస్థలికి తరలించారు.
కాంచీపురం పోలీసులు కవిన్ పై కేసు నమోదు చేశారు. తరువాత అతడు బెయిల్ పై విడుదలయ్యాడని సమాచారం. అయితే వాహనం పూర్తిగా దగ్థమైందని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఆ యువతి గురించి పోలీసులు ఆరా తీయగా.. సేఫ్ గా ఉన్నట్లు నిర్ధారించారు. అయితే అతడు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. కారు నిప్పు అంటించుకుని అందులో కూర్చుని ఉంటాడని అనుమానిస్తున్నారు. ఊపిరాడక పోవడంతో బయటకు వచ్చి ఉంటాడని అనుకుంటున్నారు. దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.