కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు.. కృషి, పట్టుదల ఉంటే ఏ పనినైనా సాధించగలుగుతాం. ఏదో ఒక రంగంలో రాణించేందుకే మనం నానా తంటాలు పడుతుంటాం. కానీ ఏరంగంలోనైనా అవలీలగా సక్సెస్ అవుతున్న.. ప్రతిభావంతుడైన యువకుడు రోమన్ సైనీ గురించి తెలుసుకుందాం..
పెద్దలు చెప్పినట్లు కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు. మనం ఏ పని చేసినా గట్టి సంకల్పబలంతో చేయాలి. సంకల్పానికి కృషి, పట్టుదల తోడైతే ఆ పని విజయవంతం అవుతుంది. అలా కృషి, పట్టుదలతో సక్సెస్ సాధించిన యువకుడు మన భారతీయుడు రోమన్ సైనీ. భారతదేశంలోని అత్యుత్తమ ప్రతిభావంతుల్లో రోమన సైనీ ఒకరు. ఆయన 18 సంవత్సరాల వయసులోనే ఎంబీబీఎస్ పూర్తి చేసి.. ఆ తర్వాత 22 ఏళ్లకే కలెక్టర్ అయ్యాడు. అనంతరం స్టార్టప్ చేసి 30 ఏళ్లకు రూ. 2600 కోట్ల విలువైన కంపెనీలో కీలక పాత్ర వహిస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేవలం 16 సంవత్సారాల వయసులోనే ఎయిమ్స్ ఎంట్రన్స్ పరీక్షలో క్వాలిఫై అయి.. ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తర్వాత నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్‌మెంట్ సెంటర్‌లో 6నెలలు పనిచేశాడు. వైద్య విద్య అనంతరం సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశాడు. అతను 22 సంవత్సరాలకే యూపీపీఎస్సీ పరీక్షలో ర్యాంక్ సాధించాడు. ఇందులో మొదటిసారే ఐఏఎస్ ఆఫీసర్‌గా నియమింపబడ్డాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. కలెక్టర్ విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే తన స్నేహితులతో కలిసి యూట్యూబ్‌లో సివిల్ సర్వీస్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు రోమన్ సైనీ. ఇందులో భాగంగా ‘అన్ అకాడమీ’ ఛానల్‌తో సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ అందించారు. దీంతో ఆ ఛానల్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన స్పందన వచ్చింది.
అదే సమయంలో రోమన్ సైనీ ఈ ఛానల్‌ని బిజినెస్‌గా మార్చాలని అనుకున్నాడు. తను అనుకున్నదే తడవుగా ‘అన్ అకాడమీ’ కంపెనీ స్థాపించాడు.
సివిల్ సర్వీస్ అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వడమే కాకుండా ఇతర కాంపిటిషన్ ఎగ్జామ్స్‌కు కూడా కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా జేఈఈ, నీట్, గేట్, సీఏ మొదలైన ఎగ్జామ్స్‌కు కోచింగ్ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే కాంపిటిషన్ ఎగ్జామ్స్‌తోపాటుగా రెగ్యులర్ అకడమిక్ కోర్సులకు శిక్షణ ఇస్తున్నాడు. ఈ విధంగా అన్ అకాడమీ కంపెనీ నేడు రూ. 2600 కోట్ల విలువైన సామ్రాజ్యంగా ఎదిగింది. ఇలా ఒక్కొక్క రంగంలో విజయం సాధించిన రోమన్ సైనీ గురించి మీ కామెంట్స్ తెలియజేయండి.