మేకపోతులను ఎన్నింటినో చూసుంటారు. కానీ ఇది మాత్రం చాలా ప్రత్యేకం. ఈ భారీ మేకపోతు ధర, బరువు, దాని ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! ఈ వివరాలు మీ కోసం..
పోటీలంటే సాధారణంగా మనుషులకే ఉంటాయని అనుకుంటాం. కానీ అలా పొరబడొద్దు. జంతువులకూ పోటీలు ఉంటాయి. మళ్లీ జంతువుల పోటీలంటే కోళ్లపందాలు లాంటివి అనుకోకండి. ఇవి కాస్త వైవిధ్యం. బరువు, అందం, రూపం ఆధారంగా ఏది బాగుందో ఎంపిక చేసి వారికి బహుమతులు ఇస్తుంటారు. అలాంటి ఓ పోటీలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుందో మేకపోతు. 110 కిలోల బరువు ఉన్న ఈ భారీ మేకపోతు వయసు మూడేళ్లు. ఒంటి మీద ఒక్క నల్లమచ్చ కూడా లేని ఈ జమునాపారి మేకపోతు రాజస్థాన్ రాష్ట్రానికి చెందింది. శంకర్ కిచర్ అనే రైతు పెంచుతున్న దీని విలువ అక్షరాలా రూ.6 లక్షలంటే నమ్మండి. ఉత్తర్ ప్రదేశ్లోని మథురకు దగ్గర్లో ఉన్న నేషనల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ గోట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నేషనల్ గోట్ ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్’లో బరువు విభాగంలో ఈ మేకపోతు ఫస్ట్ ప్రైజ్ గెలుపొందింది.
భారత్లోని పలు ప్రాంతాల నుంచి గొర్రెలు, మేకపోతులు ఈ ప్రదర్శనకు భారీగా తరలివచ్చి పోటీపడ్డాయి. కాంపిటీషన్లో మిగతా వాటిని వెనక్కినెట్టి ఆ రాజస్థాన్ మేకపోతు ప్రథమ బహుమతి గెల్చుకుంది. బరువుకు తగ్గట్లుగా మంచి ఎత్తు, ఒళ్లంతా చక్కని ఊలుతో దిట్టంగా ఉన్న ఈ మేకపోతును చూసి దాని వివరాలు తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీ సైంటిస్ట్ ఫార్మర్స్ ఇంటర్ ఫేస్ పేరిట నిర్వహించిన ఒకరోజు సదస్సుకు తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా మంది గోట్స్ ఫామ్ ఓనర్స్.. గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో గొర్రెలు, మేకల జీవాల సంపద పెరిగిన కారణంగా వాటి మీద పరిశోధనలు చేయడానికి జాతీయ పరిశోధనా కేంద్రాన్నీ ఏర్పాటు చేయాలని సదస్సులో కోరామన్నారు.