గతంలో పెళ్లి సంబంధం చూడాలి అనగానే.. పెండ్లిళ్ల పేరయ్యలు భుజాన బ్యాగ్ వేసుకొని.. అందులో వందల కొద్దీ ఫోటోలతో ఇంటి ముందు వాలిపోయేవారు. 'ఇతన్ని చూడండి.. పక్క ఊరి రామయ్యగారి అబ్బాయి, అమెరికాలో స్థిరపడ్డాడు, నెలకు లక్ష జీతం'. 'ఇదిగోండి ఇతగాడిని ఓ సారి చూడండి.. సుబ్బయ్యగారి అబ్బాయి, ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు, చూడడానికి చాలా బాగుంటాడు. మంచి కుటుంబం..' అంటూ వారికి నచ్చిందల్లా చెప్పేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
గతంలో పెళ్లి సంబంధాలు కుదర్చడం అంటే తలకు మించిన భారం. పెళ్లి సంబంధం చూడాలి అనగానే.. పెండ్లిళ్ల పేరయ్యలు భుజాన బ్యాగ్ వేసుకొని.. అందులో వందల కొద్దీ ఫోటోలతో ఇంటి ముందు వాలిపోయేవారు. ‘ఇతన్ని చూడండి.. పక్క ఊరి రామయ్యగారి అబ్బాయి, అమెరికాలో స్థిరపడ్డాడు, నెలకు లక్ష జీతం’. ‘ఇదిగోండి ఇతగాడిని ఓ సారి చూడండి.. సుబ్బయ్యగారి అబ్బాయి, ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు, చూడడానికి చాలా బాగుంటాడు. మంచి కుటుంబం..’ అంటూ వారికి నచ్చిందల్లా చెప్పేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక మ్యాట్రిమోనీలు పుట్టగొడుగుల్లా వచ్చాయి. మ్యాట్రిమోనీ పోర్టల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి యాప్‌లు వచ్చేశాయి. ఇవి చాలవన్నట్లు.. పెళ్లిల్లు చేయడం కోసం తాజాగా ఓ ప్రభుత్వ సంస్థ రంగంలోకి దిగింది.
ఈ మధ్య కాలంలో పెళ్లి సంబంధం అనగానే.. ఏమైనా చదివారా..? ఏం ఉద్యోగం చేస్తారు..? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. పోనీ, ఇద్దరు చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్నా.. పెళ్లయ్యాక మళ్లీ గొడవలు. ఒకరు ఒకచోట ఉద్యోగం చేస్తుంటే.. ఇంకొకరు మరోచోట ఉద్యోగం చేస్తుంటారు. సమయ వేళలు ఒకలా ఉండవు. లేట్ అయ్యిందా! ఎందుకు లేట్ అయ్యిందంటూ అనుమానపు ప్రశ్నలు. వీటికి చెక్ పెట్టాలంటే.. ‘ఒక్కచోట పనిచేసే ఉద్యోగులను ఒక్కటి చేయడమే’ సరైన పరిష్కారం అని ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఆలోచన చేసింది. వెంటనే తమ సంస్థ ఉద్యోగుల కోసం.. గత జనవరిలో మ్యాట్రిమోనీ పోర్టల్ సైతం ప్రారంభించింది. “ఐఓసీయాన్స్2గెదర్” (IOCians2gether) అనే పేరుతో ఈ పోర్టల్ సేవలు అందిస్తోంది. ఈ పోర్టల్ ద్వారా ఐవోసీలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు గతనెల 24న నూతన దంపతులయ్యారు.
ఐవోసీ కంపెనీలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు సీమా యాదవ్, తరుణ్ బన్సాల్ తొలిసారి ఐఓసీయాన్స్2గెదర్ వేదిక ద్వారా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. గత నెల 24న వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఐవోసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ మాధవ్ వైద్య హాజరై, వధూవరులను ఆశీర్వధించారు. ఆ వివాహ దృశ్యాలను ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. మా పోర్టల్ ‘ఐఓసీయాన్స్2గెదర్` ద్వారా దంపతులైన తొలి జంట ఇది. మీ వైవాహిక జీవితం అంతా సంతోషంగా సాగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు.
I was absolutely thrilled to witness the joyous union of Tarun and Seema, the first #IndianOil couple to find love through our very own ‘IOCians2gether’ platform that aims to create work & life partnerships within IndianOil!
Wishing you a lifetime of happiness! pic.twitter.com/LINOvRiz7C
— ChairmanIOC (@ChairmanIOCL) February 24, 2023
సీమా, తరుణ్‌లు దంపతులు గత ఐదేళ్లుగా ఐవోసీలోని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో పని చేస్తున్నారు. ఐవోసీ మ్యాట్రిమోనీ పోర్టల్ ప్రారంభించగానే వీరిద్దరూ, వారి వారి వివరాలు పోస్ట్ చేయడంతో అభిరుచులు నచ్చి ఒక్కటయ్యారు. ఆ మరుసటి నెలలోనే వీరు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. సంస్థ ఉద్యోగుల కోసం వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన ఐవోసీ సంస్థపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాఫ్ట్ వేర్ సంస్థలు కూడా ఇలాంటి సేవలు అందుబాటులోకి తెస్తే బాగుంటుందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.