ప్రశాంత్ కిశోర్…పరిచయం అక్కర్లేని మాహామేధావి. తన పదునైన వ్యూహాలతో జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు చక్రం తిప్పుతున్నాడు. ఈయన వేసే ఎత్తుగడల ముందు తలలు పండిన మేధావులు సైతం తలవంచాల్సిందే. 2014 గుజరాత్ ఎన్నికల్లో మోడీకి వ్యూహకర్తగా పనిచేసిన పీకే అద్భుతమైన విజయాన్ని మోడీకి అందించారు. ఇక ఇక్కడి నుంచే ప్రశాంత్ కిశోర్ పేరు జాతీయ రాజకీయాల్లో మారుమోగిపోయింది. ఆ విజయాన్ని పునాదిగా భావించిన పీకే అక్కడి నుంచి జాతీయ రాజకీయాలను చక్రం తిప్పే పనిలో నిమగ్నమయ్యాడు. గతంలో ఆంద్రప్రదేశ్లోని వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన పీకే వైస్ జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠాన్ని అందించాడు. ఇదే కాకుండా ఇటీవల కాలంలో జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో తన పదునైన వ్యూహాలతో ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించి ముఖ్యమంత్రి పీఠాల్లో కూర్చోబెట్టాడు.
ఇక ఉన్నట్టుండి ఇక నుంచి ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో వేలు పెట్టనంటూ సంచలన ప్రకటన చేసాడు. ఇక ఇలా ప్రకటించిన కొన్ని రోజుల తర్వాతే ఎన్సీపీ అధినేత శరత్ పవార్ తో భేటీ అయ్యారు. అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో అధికార బీజేపీకి చెక్ పెడతారనే వార్తలు వచ్చాయి. ఇదే కాకుండా శరత్ పవార్ ని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టటానికి తెరవెనుక పీకే తతంగం నడిపిస్తున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇక దీనిపై తాజాగా స్పందించిన శరత్ పవార్ రాష్ట్రపతి అభ్యర్థిగా నేనేం పోటీ చేయట్లేదంటూ స్పష్టం చేసారు.
ఇక ప్రస్తుత రాజకీయాల్లో తన మార్క్ను చెక్కుచెదరకుండా మెరుగుపరుచుకుంటున్న ప్రశాంత్ తాజాగా కాంగ్రెస్ నేతలైన రాహుల్, ప్రియాంక గాంధీలను కలిశాడు. ఇప్పుడు ఈ భేటీ జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరి సమావేశానికి గల కారణం అధికారికంగా చెప్పకపోయినా ఓ సంచలన నిర్ణయం దిశగా వీరి భేటీ జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు సైతం ఊపందుకున్నాయి.
వీరి ముగ్గురి భేటీ మాత్రం రాజకీయంగా ఏదో జరగబోతుందని తెలుస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నుంచి పీకేకు కాంగ్రెస్ పార్టీలోకి రావాలన్నపిలుపు వెళ్లినట్లు సమాచారం. మరి దీనికి ప్రశాంత్ కిశోర్ ఏం సమాధానం ఇచ్చాడనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఒకవేళ సోనియా పిలుపుకు అంగీకరించి పీకే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయంటూ రాజకీయ మేధావులు చెబుతున్న మాట. ఇదే గనుక నిజమైతే వచ్చే ఎన్నికల్లో మోడీని గద్దె దించేందుకు ఎంత సమయం పట్టదని కాంగ్రెస్ వర్గీయులు చెబుతున్నారు. మరి నిజంగానే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారో లేదో చూడాలి.