తెలంగాణలో రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు తెలిపింది. రాష్ట్రంలో నాలుగు వేల కేంద్రాలు అన్నదాతలకు అందుబాటులోకి తీసుకురానుంది. వాటి వివరాలను తెలుసుకుందాం..
తెలంగాణ అన్నదాతలకు కేంద్రం శుభవార్త తెలిపింది. నేడు పీఎం కిసాన్ సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇవాళ కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి శామీర్ పేటలో సేవా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. మిగతా కేంద్రాలను స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులచే ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ప్రధాని కిసాన్ సేవా కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న ఎరువుల దుకాణాలను పీఎం కిసాన్ సేవా కేంద్రాలుగా మార్చి రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ కేంద్రాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు, పరికరాలు, ఎరువులు, విత్తనాలు, సలహాలు, వాతావరణ సమాచారం, భూసార పరీక్షలు మొదలైనవి ఒకే చోట లభించనున్నాయి. మొత్తం 2.80 లక్షల కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కాగా, నేడు 1.25 లక్షల కేంద్రాలను ప్రారంభించనున్నారు.
ప్రధాని మోదీ నేడు రాజస్థాన్‌లో జరిగే కార్యక్రమంలో 14వ ఇన్‌స్టాల్‌మెంట్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద లబ్ధిదారులైన అన్నదాతలందరి ఖాతాల్లో రూ.2వేలు జమ చేయనున్నారు. తెలంగాణలో 39 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. అనంతరం రాజస్థాన్‌లో పీఎం కిసాన్ సేవా కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు.
ఈ కేంద్రాలు వ్యవసాయదారులకు కావలసిన క్రిమిసంహారక మందులు, పిచికారీ చేసే డ్రోన్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తారు. వ్యవసాయానికి సంబంధించిన అన్ని విషయాలపై అవగాహన కల్పించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రతినెల రెండో ఆదివారం సమావేశాలు నిర్వహించి రైతులకు కావలసిన సమాచారాన్ని అందిస్తారు. వ్యవసాయంపై ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తారు. ఇకపై అన్ని బ్రాండ్ల ఎరువులు ‘భారత్ బ్రాండ్’ పేరుతోనే రానున్నాయి.