అంగవైకల్యం ఒక శాపం అన్న భావన వదిలి ఎంతో మంది మనోధైర్యంతో ముందుకు సాగి ఎన్నో అద్భుతాలు సృష్టించారు. విద్యా, వైద్య, క్రీడా రంగాల్లో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. కృషీ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవొచ్చు అంటూ నిరూపించింది బెంగాల్ కి చెందిన ఓ దివ్యాంగురాలు. పుట్టుకతోనే దివ్యాంగురాలిగా పుట్టి పక్కవారి సహాయం లేకుండా ఎక్కడికీ కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ.. సంకల్పమే తన అక్షర ఆయుధంగా మార్చుకొని అంగవైకల్యాన్ని జయించి నెట్ పరీక్షలో ఏకంగా 99.31 శాంతం ర్యాంక్ సాధించి అందరిచే షభాష్ అనిపించకుంది. వివరాల్లోకి వెళితే..
పుట్టుకతోనే దివ్యాంగురాలిగా జన్మించింది బెంగాల్ కి చెందిన పియాషా మహల్దార్. ఆమె కేవలం మూడు అడుగుల పొడవు మాత్రమే పెరిగింది. అంతేకాదు చిన్నప్పటి నుంచి ఆమె తన సొంతపనులు సరిగా చేసుకోలేని పరిస్థితి.. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అన్ని విషయాల్లో సహాపడుతూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి పియాషా కి చదువు అంటే ఎంతో మక్కువ. తన వైకల్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా చదువు విషయంలో పట్టుదలతో ముందుకు సాగుతూ వచ్చింది.. స్కూల్, కాలేజీలో ఫస్ట్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.
ఇటీవల జాతీయ అర్హత (నెట్) పరీక్షకు హాజరై కళ్యాణీ పరీక్షా కేంద్రంలో పియాషా సిస్టమ్ ముందు పడుకొని మరీ పరీక్ష రాసింది. నెట్ పరీక్షకు సంబంధించిన ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. నెట్ పరీక్షా ఫలితాలు.. బెంగాల్ విభాగంలో పియాషా ఏకంగా 99.31 శాతం ఫలితాన్ని సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను బెంగాల్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫేసర్ గా ఉద్యోగం చేయాలని ఆశయంతో నెట్ పరీక్ష రాసినట్లు పియాషా తెలిపింది. ఆమె ఎక్కడైనా పీహెచ్ డీ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. తన అంగవైకల్యం కారణంగా ఇంటికి దగ్గర ఉన్న కళ్యాణి యూనవర్సిటీలో పీహెచ్ డీ చేసేందుకు సిద్దమైనట్లు తెలిపింది. ఉన్నత చదువుకు అంగవైకల్యం అడ్డు రాదని నిరూపించిన పియాషా పట్ల అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.