రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య కబంధహస్తాల్లో దాదాపు రెండు శతాబ్దాల పాటు నలిగిన భారతదేశాన్ని బ్రిటిషర్లు.. పొతూ పోతూ రెండుగా విడగొట్టారు. స్వాతంత్రానికి కొన్ని గంటల ముందు భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయి ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. భారత్‌కు స్వాతంత్య్రం రావడానికి కొద్ది గంటల ముందే భారతావని రెండు ముక్కలయ్యింది. విభజన సమయంలో జరిగిన అల్లర్లలో లక్షల మంది ఊచకోతకు గురయ్యారు. కోట్లాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. విభజన గాయాలు భారతీయులను దశాబ్దాలుగా వెంటాడుతూనే ఉన్నాయి.
విభజన సమయాన్ని గురుటుచేసుకుంటూ అవి భయంకరమైన రోజులని ప్రధాని మోడీ అన్నారు. భారత్, పాక్ విభజన సమయంలో ప్రజలు పడిన బాధలు ఎప్పటికి మరిచిపోలేమని ప్రధాని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 14వ తేదీని ఇక నుంచి విభజన కష్టాల స్మృతి దివస్‌గా (Partition Horrors Remembrance Day) పాటించాలని పిలుపునిచ్చారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా లక్షలాదిమంది సోదర సోదరీ మణులు విడిపోవాల్సి వచ్చింది. అప్పటి ద్వేషం, హింస కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోయారని ట్వీట్ చేశారు.
దేశ విభజన వల్ల ప్రజల్లో సామాజిక విభజనలు వచ్చాయని, సామరస్యం లోపించిందని, ఆ విష బీజాలను పారద్రోలేందుకు పార్టిషన్ హారర్స్ రిమెంబ్రెన్స్ డే నిర్వహించాలని మోదీ తెలిపారు. దేశ విభజన మిగిల్చిన గాయాలు ఎప్పటికీ మానేవి కావన్నారు. ఈ రోజున దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులు, ప్రజల సేవలను గుర్తు చేసుకోవాలన్నారు. సామాజిక విభజన, అసమానతలను రూపుమాపాల్సిన అవసరాన్ని ఈ రోజు మనకు గుర్తు చేస్తోందన్నారు. అనవసర ద్వేషం, హింస వల్ల ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఈ స్మృతి దినం ఏకత్వ స్పూర్తిని నింపాలన్నారు. సామాజిక సామరస్యం, మానవ సాధికారత మరింత బలోపేతం కావాలని మోడీ తెలిపారు.