ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే.. చివరికి రైతులకు కన్నీళ్లే మిగిలుతున్నాయి. మహారాష్ట్రలో రైతులు ఎంతో కష్టపడి ఉల్లి పంట పండిస్తే గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టాల పాలవుతున్నారు.
పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. మట్టినే నమ్మకున్న రైతన్న ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే.. చివరికి కన్నీళ్లే మిగులుతున్నాయి. ఎంతో కష్టపడి పంటలు పండిస్తే గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టాల పాలవుతున్నారు. దీని కారణంగా ఎంతో మంది రైతులు చేసిన అప్పులు తీర్చలేక చివరికి ఉరి కొయ్యలకు వేలాడుతున్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ఉల్లి రైతులకు ధరలు కన్నీళ్లు మిగిల్చుతున్నాయి. ఇటీవల ఓ రైతు 512 కిలోల ఉల్లి పాయలను అమ్మితే అన్ని పోను చివరికి అతని చేతికొచ్చింది కేవలం రూ.2 లు మాత్రమే. దీనికి సంబంధించిన ఓ ఫొటో సైతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర సోలాపూర్ లో రాజేంద్ర చవాన్ అనే రైతు నివాసం ఉంటున్నాడు. అయితే ఈ రైతు తన పొలంలో గత కొన్నేళ్ల నుంచి ఉల్లి పంటను పండిస్తున్నాడు. ఇక పండించిన పంట చేతికి రావడంతో ఆ రైతు ఫిబ్రవరి 17న 512 కిలోల ఉల్లిపాయలను మార్కెట్ కు తరలించాడు. ఆ రైతు తెచ్చిన ఆ ఉల్లిపాయలను కిలో రూ.1 చొప్పున మొత్తం కొంటామని మార్కెట్ అధికారులు చెప్పారు. దీనికి రాజేంద్ర చవాన్ సరే అనడంతో ఆ 512 కిలోల ఉల్లిపాయాలను అమ్మితే కేవలం రూ.512 వచ్చాయి.
ఇక ఇందులో రవాణా ఖర్చులు, కూలీల ఖర్చు, మార్కెట్ ఖర్చులు అన్నీ పోను.. రూ. 2.49 మిగిలాయి. దీంతో వచ్చిన ఆ మొత్తాన్ని మార్కెట్ అధికారులు రౌండ్ ఫిగర్ చేసి రూ.2 రసీదును రైతు రాజేంద్ర చవాన్ చేతికి అందించారు. దీనిని చూసిన రైతు రాజేంద్ర చవాన్ ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఇదే బిల్లును ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. దీనిని చూసిన ఆ రాష్ట్ర రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే రైతులు బతికేది ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే రసీదు ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.