ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో వ్యాపిచింది. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు నిర్ధరణ జరిగింది. కర్ణాటకలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిన ఇద్దరిలో ఒక వ్యక్తి ప్రైవేట్ ల్యాబ్‌లో నెగెటివ్ రిపోర్టు తెచ్చుకుని దుబాయ్ కి చెక్కేశాడు. తీరా అతను వెళ్లిపోయాక అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. అతనికి విమానాశ్రయంలో పాజిటివ్ వచ్చిన తర్వాత వారంపాటు కర్ణాటకలోని ఓ హోటల్ లో ఉన్నాడు. ఇప్పుడు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
మరోవైపు కర్ణాటకలో సౌతాఫ్రికా నుంచి వచ్చిన 10 మంది ప్రాయాణికులు విమానాశ్రయంలో కరోనా టెస్టు చేయించుకోకుండా తప్పించుకున్నారు. ఇప్పుడు వారికోసం వెతుకులాట మొదలు పెట్టారు అధికారులు. శుక్రవారం రాత్రికల్లా వారిని పట్టుకుంటామంటూ కర్ణాటక ఆర్థిక మంత్రి అశోక్ వెల్లడించారు. ‘66 సంవత్సరాల సౌతాఫ్రికా పౌరుడు నవంబరు 20న సౌతాఫ్రికా నుంచి కర్ణాటక వచ్చాడు. అతనికి ఒమిక్రాన్ నిర్ధరణ జరిగింది. అప్పటికే అతను దుబాయ్ వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి బస చేసిన హోటల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాం. అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసుకుంటాం’ అంటూ మంత్రి తెలియజేశారు.
ఆ వ్యక్తి రెండు డోసుల టీకాలు తీసుకున్నాడని, కరోనా నెగెటివ్ రిపోర్టుతో వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ వైద్యుడు అతడిని కలిసినప్పుడు కరోనా లక్షణాలు లేనట్లు చెప్పారు. స్వీయ నిర్భందంలో ఉండాలని సూచించామన్నారు. అతను కరోనా ముప్పు ఉన్న దేశం నుంచి వచ్చినందున అతని నమూనాలు తీసుకుని జీనోమ్ పరీక్షకు నవంబరు 22న పంపినట్లు తెలిపారు. అతనిని కలిసిన 24 మందికి పరీక్షలు నిర్వహించినట్లు అవన్నీ నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు. సెకండరీ కాంటాక్టులైన 240 మందికి కూడా నెగెటివ్ వచ్చినట్లు వెల్లడించారు. నవంబర్ 23న మరోసారి టెస్టు చేయించుకుని నెగెటివ్ రిపోర్టు రాగానే హోటల్ నుంచి చెకౌట్ చేసి క్యాబ్ లో విమానాశ్రయానికి వెళ్లినట్లు గుర్తించారు. అక్కడి నుంచి దుబాయ్ కు వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ ఈ విషయంపై స్పందించారు. ‘గతంలోనూ స్టేట్ పోలీసులు కాంటాక్టు ట్రేసింగ్, పేషంట్స్ మిస్సింగ్ విషయంలో బాగా పనిచేశారు. ఈ సారి కూడా అంతే పట్టుదలతో పని చేస్తారు. ఆఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికులు ఎవరైతే టెస్టు చేయించుకోకుండా తప్పించుకున్నారో వారిని వెంటనే కనిపెడతాం’ అంటూ వెల్లడించారు. ఒమిక్రాన్ తో దేశంలో మూడో దశ కరోనా మొదలు కాబోతోందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.