పెళ్లంటే నూరేళ్ల పంట.. కానీ ఆ జంటకు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. వివాహ బంధంతో ఒక్కటైన ఆ జంట ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న సమయంలో వారం రోజులకే నవదంపతులిద్దరూ కరోనాబారినపడగా.. భార్య త్వరగానే కోలుకుంది. యువకుడికి కరోనా ప్రభావం ఎక్కువ కావడంతో ఊపిరితిత్తులు దెబ్బతిని చనిపోయాడు. కరోనా బారినపడి భర్త చనిపోతే.. కన్నీటి బాధలో ఉన్నా కూడా ఆ యువతి మంచితనాన్ని చాటుకుంది. కరోనా పోరాడుతున్న సమయంలో పలువురు తనకు చేసిన సహాయం మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి, రెడ్‌క్రాస్ సొసైటీకి అందజేసి ఓ యువతి మానవత్వం చాటుకుంది. కోవిడ్‌తో చికిత్స పొందుతూ భర్త చనిపోగా.. దాతలు చేసిన సాయంలోని మిగిలి ఉన్న రూ.40 లక్షలు ప్రభుత్వానికి అప్పగించింది.
వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని భద్రక్ జిల్లా బాసుదేవ్‌పూర్ ప్రాంతానికి చెందిన అభిషేక్ మహాపాత్ర.. ఒమన్‌లో ఇంజినీర్‌గా పనిచేసేవాడు. గతేడాది మేలో మౌసిమి అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లైన సంతోషం వారం కూడా లేకుండా అభిషేక్‌కు కొవిడ్ సోకడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తన భర్తకు కరోనా రావడంతో అనారోగ్యానికి గురయ్యాడని.. ఆర్థిక సహాయం అందించగలరని సోషల్ మీడియా ద్వారా మౌసిమి కోరింది. ఆమె అభ్యర్థనకు స్పందించిన పలువురు దాతలు ముందుకొచ్చి తమకు తోచిన సాయం అందించారు. దీంతో అభిషేక్‌ను చికిత్స కోసం ఎయిర్‌లిఫ్ట్ ద్వారా జూన్ 7 కోల్‌కతాకు తరలించారు. ఆస్పత్రిలో మూడు నెలల పాటు కరోనాతో పోరాడుతూ అభిషేక్ మృతిచెందాడు.
భర్త చనిపోయాడన్న ఆవేదనలో ఉన్న మౌసిమి తనకు విరాళంగా వచ్చిన డబ్బును సొంతానికి వాడుకోకుండా తనలా కష్టాల్లో ఉన్న మరికొంత మందికి ఉపయోగపడేలా చేయాలని భావించింది. తనకు సాయంగా వచ్చిన మొత్తంలో మిగిలిన రూ.40 లక్షలను మౌసిమి సోమవారం భద్రక్ కలెక్టర్‌ను కలిసి రూ.30 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి.. రూ.10 లక్షలను రెడ్‌క్రాస్ నిధికి అందించారు.
ఇది చదవండి : జై భీమ్ మూవీకి అరుదైన గుర్తింపు! ఫస్ట్ ఇండియన్ మూవీ!
ఈ సందర్భంగా మౌసిమి మాట్లాడుతూ.. నా కుటుంబంపై ముఖ్యంగా నా భర్త ప్రాణాలను కాపాడటానికి పలువురు ఉదారతను చాటుకున్నందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. ఈ డబ్బు నా భర్త ప్రాణాలు కాపాడలేకపోయింది. కరోనా భారిన పడి కష్టాలు చాలా మంది పడుతున్నారు.. తమవారిని రక్షించుకోడానికి ఆర్థికంగా తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఎంత కష్టపడుతుందో స్వయంగా అనుభవించిన నాకు తెలుసు.. అలాంటి బాధితుల కోసం సమాజం నుంచి తాను పొందిన సాయాన్ని తిరిగిచ్చేస్తున్నాను అని మౌసిమి అన్నారు. ఈ కాలంలో డబ్బుకు లోకం దాసోహం అంటారు.. డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులకైనా తెగబడుతున్నారు. కానీ అందుకు భిన్నంగా ఆమె వ్యవహరించి దాతలు ఇచ్చిన మొత్తాన్ని సమాజం కోసం అందజేసింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.