డ్రైవింగ్ లైసెన్స్.. మనం ఒక వెహికల్ తీసుకుని రోడ్డు మీదకు వస్తున్నాం అంటే కచ్చితంగా మనకు లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేకుండా బండి నడపడం నేరం. అలా బండి నడిపినందుకు జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. కొత్తగా బండి నేర్చుకోవాలి అన్నా.. లెర్నింగ్ లైసెన్స్ తీసుకుని మీరు వెహికల్ నడపాల్సి ఉంటుంది. మీకు లైసెన్స్ రావాలి అంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ముందు రెల్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత మీరు ఆర్టీవో కార్యాలయంలో లైసెన్స్ టెస్టు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ రోజు మీరు వెళ్లి ఆర్టీవో కార్యాలయంలో ఉండే ట్రాక్‌లో బండి నడపాల్సి ఉంటుంది. ఇదంతా తప్పకుండా జరిగే ప్రక్రియ. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదని చెబుతున్నారు. ఆర్టీవో టెస్టు లేకుండానే మీరు డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు.
అవును ఆర్టీవో టెస్టు లేకుండానే మీరు లైసెన్స్ పొందవచ్చు. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ కొత్త నిబంధనలను విడుదల చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు-2022 ప్రకారం ఆర్టీవో టెస్టు లేకుండానే మీరు డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. కాకపోతే మీరు గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొత్త మార్గదర్శకాలు అమలులోకి రాగా.. పాత విధానాలు కూడా అమలులోనే ఉంటాయని చెబుతున్నారు. కొత్తగా అమలులోకి వచ్చిన ఈ విధానాన్ని కొన్ని నెలలపాటు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. అయితే ఆర్టీవో టెస్టు లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి అంటే.. గుర్తింపు పొందిన శిక్షణా కేంద్రంలో మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలి.
మీ శిక్షణ పూర్తైన తర్వాత అర్హులైన వారికి పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అలా మీరు ఉత్తీర్ణులైతే మీకు సదరు శిక్షణా కేంద్రం ఓ సర్టిఫికేట్ జారీ చేస్తుంది. ఆ సర్టిఫికేట్ తీసుకుని మీరు ఆర్టీవో కార్యాలయంలో అప్లై చేసుకుంటే మీ డ్రైవింగ్ లెైసెన్స్ వస్తుంది. ఈ శిక్షణా కేంద్రాలను కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాని చెబుతున్నారు. అయితే ఈ కొత్త విధానంపై పలు అనుమానాలు, భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం ద్వారా లైసెన్స్ అనేది ప్రైవేటు పరం అయిపోతుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు శిక్షణ కేంద్రాలను గనుక ప్రైవేటు వ్యక్తులకు అప్పజెపితే డబ్బుకు ఆశపడి సర్టిఫికేట్ ఎందుకు జారీ చేయరని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విధానాన్ని ఇప్పుడు పరీక్షిస్తున్న నేపథ్యంలో అసలు ఎలాంటి ఫలితాలు ఇస్తోంది అనేది తెలియాలి అంటే ఇంకా కొన్ని నెలలు వేచిచూడాల్సిందే.