గిరిజన యువకుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కూడా తీవ్రంగా స్పందించారు. నిందితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
మధ్యప్రదేశ్‌లో గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేసిన ఘటన దేశం మొత్తం సంచలనం రేపిన విషయం అందరికి తెలిసిందే. ఆదివాసీ యువకునికి జరిగిన ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోపాల్ లోని తన నివాసానికి గిరిజన యువకుడిని పిలిపించి అతనికి జరిగిన అవమానానికి విచారం వ్యక్తపరిచారు. అనంతరం బాధితుడు దశరథ్ రావత్ ను కుర్చీలో కూర్చోబెట్టి అతడి కాళ్లు కడిగి సన్మానించారు. ముఖ్యమంత్రి దశరథ్ రావత్ ను స్నేహితుడిగా భావించి చాలాసేపు ముచ్చటించారు.
సీఎం శివరాజ్ సింగ్, ఆదివాసీ యువకుడు ఇద్దరు కలిసి స్మార్ట్ సిటీలో ఓ మొక్కను నాటారు. దశరథ్ రావత్ కుటుంబానికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి సీఎం ఆరా తీశారు. ముఖ్యమంత్రితో సమావేశమైన తర్వాత దశరథ్ రావత్ మీడియాతో కూడా మాట్లాడాడు. అతను సీఎంను కలవడం చాలా సంతోషంగా ఉందని రావత్ సంతోషం వ్యక్తం చేశాడు. తన కుటుంబసభ్యులను కూడా ముఖ్యమంత్రి పిలిపించారని తెలిపాడు. వారితో కూడా సీఎం మాట్లాడారని వెల్లడించాడు.
మధ్యప్రదేశ్ సీదీ జిల్లాలో ప్రవేశ్ శుక్లా రావత్ పై మూత్రం పోయగా తీసిన వీడియో.. గత మూడు నెలల క్రితం జరిగిన ఘటనగా అధికారులు గుర్తించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ లో రాజకీయంగా దుమారం రేకెత్తించింది. ఘటన అనంతరం ప్రవేశ్ శుక్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బుల్డోజర్ తో అతడి ఇంటిని కూల్చేయించారు. అతనికి తగిన శాస్తి జరిగిందని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గిరిజనుడి కాళ్లు కడిగి, క్షమాపణ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.