దేశంలో నిత్యం వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో పార్కింగ్ సమస్య కూడా దారుణంగా పెరిగిపోతుంది. దేశ వ్యాప్తంగా పార్కింగ్ సమస్యలు ఎదురు కావడంతో కొంత మంది తమ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తుంటారు. దీని వల్ల రోడ్డు పై వెళ్తున్నవారికి ఇబ్బందులు కలుగుతుంటాయి. నో పార్కింగ్ అనే బోర్డులు ఏర్పాటు చేసినా వాటిని కొంత మంది పట్టించుకోరు. ఈ క్రమంలో కేంద్రం త్వరలో ఓ కొత్త చట్టం తీసుకు వచ్చేందుకు సన్నద్దమవుతుంది. వివరాల్లోకి వెళితే..
గత కొంత కాలంగా దేశంలో పెరిగిపోతున్న వాహన పార్కింగ్ ఇబ్బందులను అరికట్టడానికి కేంద్రం ఓ చట్టం తీసుకు వచ్చేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా నో పార్కింగ్ బోర్డ్ అని రాసి పెట్టి ఉన్నప్పటికీ లెక్కచేయకుండా వాహనాలను పార్కింగ్ చేసినట్లయితే వారికి రూ.1000 జరిమానా విధిస్తే.. ఫొటో పంపిన వ్యక్తికి రూ.500 రివార్డుగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ చట్టం గురించి ఆలోచిస్తున్నామని, తొందరలోనే దీనిపై ఒక క్లారిటీ వస్తుందని అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. ఈ చట్టం తీసుకు వస్తే.. అక్రమంగా పార్కింగ్ ల సంఖ్య తగ్గుతుందని అన్నారు. ట్రాఫిక్ జామ్ సమస్యలు లేకుండా చేయవొచ్చని ఆయన అన్నారు. పార్కింగ్ స్థలాల్లో కాకుండా రహదారులపై కొందరు వాహనదారులు తమ వాహనాలను పార్కింగ్ చేస్తుండటం పట్ల గడ్కరీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీవాసులు ఎంతో అదృష్టవంతులు అని.. పార్కింగ్ కోసం అక్కడ ప్రత్యేకంగా రహదారులు ఉన్నాయని పేర్కొన్నారు. మరి ఈ కొత్త చట్టంతో పార్కింగ్ సమస్యలకు ఎంత వరకు చెక్ పెట్టవొచ్చు అన్న విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.