దేశంలోని వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పట్ల మక్కువ చూపుతున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ఈవీ ల వినియోగం బాగా పెరిగింది. అయితే ఛార్జీంగ్ సమస్య కొంత వాహనదారులను ఇబ్బంది పెడుతుంది. అయితే ఈవీ వాహనాలు వినియోగించే వారికి ఓ శుభవార్త. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే.. ఎలక్ట్రికి రోడ్లు రానున్నాయి.
పర్యావరణాన్ని కాపాడాటానికి.. దానిని ముందు తరలాకు అందించాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి. పర్యావరణానికి హాని చేసే వస్తువులను వాడకుండా తమను తాము నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాల వినియోగాన్ని క్రమక్రమంగా తగ్గించాలి. అలానే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ రోడ్ల గురించి ప్రస్తావించారు.
ఇటీవలే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ కార్యక్రమం జరిగింది. దీనికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాల గురించి ప్రస్తావిస్తూ.. పలు కీల విషయాలు వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పట్ల మక్కువ చూపుతున్నారని, దీంతో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ ఏర్పడుతున్నదని ఆయన తెలిపారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారని మంత్రి అన్నారు.
కాలుష్యాన్ని నియంత్రించాలి, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా, ఎలక్ట్రిక్ రోడ్లు నిర్మించే అవకాశాలను అధ్యయనం చేయాలని ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు. తక్కువ ఖర్చు ఎక్కువ లాభం ఉండే విధంగా ఎలక్ట్రిక్ హైవేల అభివృద్ధికి పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఆర్థికంగా లాభదాయకమైన ఎలక్ట్రిక్ రోడ్లు రూపొందించడంపై టాటాతో పాటు మరికొన్ని కంపెనీలతో చర్చించామని తెలిపారు. ఇప్పుడు స్వీడన్ దేశం దాదాపు 3000 కిలోమీటర్ల పొడవునా అలాంటి హైవేని నిర్మించేందుకు సిద్ధమవుతోందని తెలిపారు. సుదూర ప్రాంతాలకు సులభంగా ప్రయాణించగలిగేలా రోడ్లకు రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అలానే ఇందుకోసం చాలా కంపెనీలు తమ కాన్సెప్ట్‌లను అందించాయని కేంద్రమంత్రి తెలిపారు.
ప్రస్తుతం తమ వద్ద ఎలక్ట్రిక్ రోడ్ల కోసం రెండు నమూనాలు ఉన్నాయన్నారు. మొదటి కాన్సెప్ట్ లో రైళ్లు లేదా మెట్రోల కోసం ఉపయోగించే ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్‌పై ఆధారపడి ఉంటుంది. వాహనాలు ఓవర్ హెడ్ వైర్లు ఉన్న చోట విద్యుత్తుతో నడుస్తాయి. ఓవర్ హెడ్ వైర్లు లేని చోట బ్యాటరీ లేదా పెట్రోల్, డీజిల్‌తో నడుస్తాయి. రెండవ కాన్సెప్ట్‌లో టైర్ల ద్వారా వాహనాల ఇంజిన్‌కు విద్యుత్‌ను ప్రసారం చేయడం ద్వారా నడిపించవచ్చును. ఈ విధంగా చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటు యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేయవచ్చని కేంద్ర మంత్ర నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.