పార్లమెంటు పని తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ విచారం వ్యక్తం చేశారు. సభలో ముఖ్యమైన చట్టాలపై చర్చలు జరగడం లేదని సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు చట్టసభల్లో పూర్తిగా న్యాయవాదులు ఉండేవారని.. ఇప్పుడా పరిస్థితి కనిపించడంలేదని చెప్పారు. చట్టాలపై స్పష్టత లేదని, చట్టం ఉద్దేశమేమిటో మనకు తెలియదన్నారు. న్యాయవాదులు, మేధావులు సభల్లో లేకపోవడం వల్ల నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. స్వాతంత్య్ర సమర యోధుల్లో చాలామంది న్యాయవాదులు ఉండేవారని లోక్ సభ, రాజ్యసభ వారితో నిండిపోయి ఉండేవని పేర్కొన్నారు.
న్యాయవాదులు లీగల్ సర్వీసులకే పరిమితం కాకుండా.. పబ్లిక్ సర్వీసు కూడా చేయాలనీ సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. చట్టసభల చర్చల్లో రోజురోజుకు నాణ్యత తగ్గుతున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. చట్టాల రూపకల్పనలో సమగ్రత లోపించడం లిటిగేషన్లకు దారి తీస్తోందని ఆరోపించారు. కొత్త చట్టాలు చేసే సమయంలో పార్లమెంట్‌లో చర్చ జరగకపోవడంతో న్యాయపరమైన చిక్కులు ఏర్పడే అవకాశముందని సీజేఐ అభిప్రాయపడ్డారు. కొత్త చట్టాల అమలు ఉద్దేశం ఏంటనేది కూడా అర్ధం కావడం లేదన్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉభయసభల్లో చట్టాలపై చర్చలు అసంపూర్తిగానే జరిగాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం సాగినప్పటికీ దాదాపు 22 బిల్లులు ఆమోదం పొందాయని కేంద్రం ప్రకటించింది. ఈ విషయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చర్చలు జరగకుండా బిల్లులు ఆమోదించారని నిపుణులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.