మే 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. కొత్త పార్లమెంట్‌లో సెంగోల్‌ని పొందుపర్చనున్నట్లు ప్రకటించారు అమిత్ షా. సెంగోల్ చరిత్ర..
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం మే 28న జరగనుంది. పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకకు హాజరు కావొద్దని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి. పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించి.. పార్లమెంటరీ వ్యవస్థ గొప్పతనాన్ని చాటాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. విపక్షాల విమర్శలు, వాదనలు ఎలా ఉన్నా మే 28 ఆదివారం అంగరంగ వైభవంగా పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. దీనిలో భాగంగా కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్‌ను పొందుపర్చనున్నట్లు ప్రకటించారు. అమిత్ షా ప్రకటన నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెంగోల్ అంటే ఏంటి.. దాని ప్రాధాన్యత గురించి జోరుగా చర్చించుకుంటున్నారు. మరి ఇంతకు సెంగోల్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్‌ను పొందుపరుస్తామన్నారు అమిత్ షా. ఇంతకు సెంగోల్ అంటే ఏంటి అంటే.. రాజదండం అని అర్థం. దీనిని తమిళంలో సెంగోల్ అంటారు. రాజులు, రాజ్యాలు ఉన్నప్పుడు.. తమ సార్వభౌమత్వానికి చిహ్నంగా దీన్ని ధరించేవాళ్లు. రాజులు, రాజ్యాల పోయి.. ప్రజస్వామ్య పాలన వచ్చాక ఈ సెంగోల్ వాడుకలోకి రాలేదు. పూర్వ కాలంలో ఒక రాజు దగ్గర నుంచి మరో రాజుకు అధికారాలు బదిలీ చేసే సమయంలో ఈ సెంగోల్‌ని వాడేవారు. అలా 1947లో మనకు స్వాతంత్య్రం వచ్చాక.. అప్పటి బ్రిటీష్ చివరి వైశ్రాయి జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్ దగ్గర నుంచి.. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు అధికారాలు బదిలీ చేస్తూ ఈ రాజదండాన్ని మనకు అందజేశారు. అయితే ఈ ఆలోచన వెనక చాలా పెద్ద మేధోమధనమే జరిగింది.
సుమారు 200 ఏళ్ల పాటు సాగిన బ్రిటీష్ పాలనకు ఆగస్టు 15, 1947తో చరమగీతం పాడారు. స్వాతంత్య్రం వచ్చాక భారతదేశంలో ప్రజా పాలన ఏర్పడింది. అప్పటి వరకు మనల్ని ఏలిన బ్రిటీష్ వారి దగ్గర నుంచి మనకు పూర్తి అధికారాలు బదిలీ అయ్యాయి. అయితే ఈ అధికార బదిలీ ఎలా జరగాలి అనే దాని గురించి పెద్ద ఎత్తున చర్చ సాగింది. గెజిట్ ముద్రించాలా, ప్రకటన విడుదల చేయాలి అనే దాని గురించి తర్జనభర్జనులు చోటు చేసుకున్నాయి. జవహర్ లాల్ నెహ్రూ, లార్డ్ మౌంట్ బాటెన్‌ల మధ్య కూడా అధికార బదిలీని ఎలా చేయాలి అనే చర్చ సాగింది. ఏం పాలుపోలేదు.
దాంతో అప్పటి చివరి వైశ్రాయ్ సీ. రాజగోపాలాచారీ (రాజాజీ)ని దీని గురించి ప్రశ్నించారు జవహర్‌లాల్ నెహ్రూ. రాజాజీ కాస్త సమయం తీసుకుని.. దీని గురించి ఆలోచించి.. ఓ ప్రతిపాదన చేశారు. అప్పుడే సెంగోల్ అనగా రాజదండం పేరు తెర మీదకు వచ్చింది. చోళుల చరిత్రలో ఉన్న సెంగోల్ పేరు తొలిసారి తెర మీదకు వచ్చింది.చోళుల కాలంలో ఓ రాజు నుంచి మరో రాజుకి అధికారులు బదిలీ చేసే సమయంలో ఓ రాజదండాన్ని గుర్తుగా ఇచ్చేవారు. ఇదే విషయాన్ని రాజాజీ..నెహ్రూకి వివరించారు.
వెంటనే మౌంట్‌బట్టెన్‌కి ఈ విషయం చెప్పారు నెహ్రూ. ఈ పద్దతి నచ్చడంతో ఆయన కూడా సరే అంటాడు. అలా మౌంట్ బాటెన్ నుంచి నెహ్రూకి అధికారాలు బదిలీ అయ్యాయి. ఈ సెంగోల్ స్వీకరణ కార్యక్రమం పూర్తిగా తమిళ సంప్రదాయంలోనే జరిగింది. ఆ తరవాత దాన్ని అలహాబాద్‌లోని మ్యూజియంలో ఉంచారు. అప్పట్లో ఉమ్మిడి బంగారు చెట్టి అనే స్వర్ణకారుడు ఈ బంగారు సెంగోల్‌ని తయారు చేశారు. మొత్తం బంగారంతో తయారు చేసిన ఈ దండంపై నంది బొమ్మను చెక్కారు.
ఇదే సెంగోల్‌ని కొత్త పార్లమెంట్‌లో పొందుపరచనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెల్లడించారు. ‘‘1947 ఆగస్టు 14వ తేదీన తొలి ప్రధాని నెహ్రూకి ఈ సెంగోల్ అందించారు. తమిళ్‌లో సెంగోల్ అంటే సంపద అని అర్థం. మన దేశ చరిత్రలో ఈ సెంగోల్‌కి ఎంతో ప్రత్యేకత ఉంది. అంతే కాదు. అధికారాల బదిలీకి ప్రతీకగా నిలిచిపోయింది’’ అన్నారు.