ఈ మధ్య కాలంలో హిందూ మతంపై హిందూ దేవుళ్లపై విమర్శలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం బైరి నరేష్ అనే వ్యక్తి.. అయ్యప్ప స్వామి జననం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నరేష్ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప భక్తులే కాక.. హిందువులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ వివాదం సద్దుమణిగింది అనుకునేలోపే మరో వివాదం తెర మీదకు వచ్చింది. ప్రముఖ రచయిత ఒకరు.. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా రాముడు.. సీతా మాతతో కలిసి నిత్యం మద్యం సేవించేవాడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..
ప్రముఖ రచయిత, హేతువాది కేఎస్ భగవాన్ శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యాహ్నం సీతతో కూర్చుని ద్రాక్షారసం సేవించడం రాముడి ప్రధాన కార్యకలాపమని.. ఇది తాను చెప్పడం లేదని.. దీని గురించి స్వయంగా వాల్మికీ రామయణంలోనే ఉందన్నాడు. జనవరి 20వ తేదీన కర్ణాటకలోని మాండ్యాలో జరిగిన ఓ కార్యక్రమంలో భగవాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేఎస్ వ్యాఖ్యలకు నిరసనగా.. పలు హిందూ సంఘాలు కువెంపునగర్‌లోని ఆయన ఇంటి ముందు హిందూ సంఘం నాయకుడు నిశాంత్ నేతృత్వంలో పూజలు చేసేందుకు ప్రయత్నించాయి. దీంతో ప్రభుత్వం కేఎస్ భగవాన్ ఇంటి వద్ద భద్రతను పెంచింది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అయితే కేఎస్ భగవాన్.. శ్రీరాముడిపై ఇలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2019 లో కూడా రాముడిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు మత్తు పదార్థాలు తాగేవాడని, సీతను కూడా తాగేలా చేశాడని వ్యాఖ్యానిస్తూ.. అప్పట్లో పెద్ద వివాదానికి తెరలేపారు. ఆయన రాసిన ‘రామ మందిర యాకే బేడా’ పుస్తకంలో ఈ విషయాలను పేర్కొన్నాడు. అంతేకాక సీతను నిర్ధాక్షిణ్యంగా అడవులకు పంపాడని.. ఆ తర్వాత ఆమె పరిస్థితి ఏమిటనే విషయాన్ని కూడా పట్టించుకోలేదని ఆరోపించాడు. కానీ మన పురోహితులను అడిగితే రాముడి గురించి రోజుకో కథ చెబుతుంటారని, నిజానికి రాముడు రాత్రుల్లో సీతతో కలిసి మత్తుపానీయం తీసుకునేవాడని, ఈ విషయాన్ని తాను చెప్పడం లేదని, వాల్మీకి రామాయణంలో ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసి వివాదాన్ని రాజేశాడు.