ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.. అన్ని రంగాల్లోకి ఇది క్రమక్రమంగా ప్రవేశిస్తోంది. దీని గురుంచి ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి పుట్టకపోయినా.. మనలానే అన్ని పనులు చేస్తోంది.. ఆలోచిస్తుంది. ప్రవర్తిస్తోంది. దానిలో భాగంగానే శ్రీరాముడి ఫొటో ఒకటి క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మరి నిజంగానే రాములవారు అలా ఉండేవారా అంటే..
నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ వైరలవుతోంది. శ్రీరాముడు 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎంత అందగా ఉన్నాడో చూశారా అంటూ ఓ ఫొటో నెట్టింట్లో తెగ హల్చల్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో క్రియేట్ చేసిన ఈ ఫొటో చూసి.. నిజంగానే రాముడు.. 21 ఏళ్ల వయసులో యవ్వనంలో ఇలా ఉండేవాడా అన్నట్లుగా ఉంది ఆ రూపం. పాలు గారే బుగ్గలు, ముఖంలో ఇంకా పసి ఛాయలు, ముట్టుకుంటే కందిపోయే రూపంతో అప్పుడే యవ్వనంలోకి ప్రవేశిస్తున్న ఓ సుకుమార సుందర రూపుతో ఉన్న యవ్వనస్తుడి ఫొటోని ఏఐ క్రియేట్ చేస్తే.. ఇదే మా రాముడు అంటూ జనాలు సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ చేశారు. రాముడి మీద భక్తి ఉండటం తప్పు లేదు. కానీ అత్యుత్సాహం కొద్ది.. మనలో మనమే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాం. అదేంటి మేమేదో రాముడి మీద భక్తి కొద్ది.. ఈ ఫొటో షేర్ చేశాం దానిలో తప్పేముంది అంటారా..
వాల్మికీ రామాయణంతో సహా రాముడికి సంబంధించి ఏ గ్రంధం తీసుకున్నా.. అందులో రాముడి వర్ణన ఆజానుబాహుడు, నీల మేఘ శ్యాముడు అనే ఉంటుంది. నీల మేఘ శ్యాముడు అంటే నలుపు లేద నీలం రంగు వర్ణంలో ఉండేవాడు. కానీ ఏఐ క్రియేట్ చేసిన ఫొటోలో రాముడు.. పసిమి ఛాయతో మెరిసిపోతున్నాడు. అలానే ఆయన ఆజానుబాహుడు.. వాల్మికీ రామయణం ప్రకారం రాముడి ఎత్తు 9 అడుగులు అని వర్ణించాడు. ఇక అరణ్యకాండలో హనుమంతుడు.. లంకలో సీతాదేవిని కలిసిన సమయంలో.. రాముడి ఎలా ఉంటాడో కళ్లకు కట్టినట్లు వర్ణించాడు.
హనుమంతుడు చెప్పిన దాని ప్రకారం రాముడు విశాలమైన భుజాలు, పొడవైన చేతులు, శంఖం వంటి కంఠము, కాంతితో వెలిగిపోయే ముఖం, గంభీరమైన స్వరం, నిగనిగలాడే చర్మంతో.. ఎక్కువ తక్కువ కాకుండా.. సమానంగా రూపుదిద్దుకున్న చక్కని అవయవాలతో మేఘశ్యామవర్ణంలో అలరారుతున్నాడు. ఆయన కంఠస్వరము, నడక, నాభి గంభీరముగా ఉంటాయి. ఇక ఆయన అందమైన పెదవులు, గడ్డం, కొనదేలిన ముక్కు, విశాలమైన కన్నులు, చక్కని పలు వరస, మెరిసిపోయే చర్మము, బలమైన పాదాలు, నల్లగా నిగనిగలాడే జుట్టుతో నా రామ చంద్రమూర్తి అలరారుతుంటాడు. చూస్తున్న కొద్ది చూడాలనిపించే ఆకర్షణ, అందం ఆయన సొంతం అని హనుమంతుడు.. సీతా దేవి ముందు రాముడిని వర్ణించాడు.
ఇక ఏఐ క్రియేట్ చేసిన ఫొటోలో రాముడు.. అప్పుడే బాల్యం ముగించుకుని యవ్వనంలోకి అడుగుపెడుతున్న సుకుమారుడిగా ఉన్నాడు. ఎండ కన్నెరగని, కష్టమన్నది తెలియని రాకుమారుడిలా ఉన్నాడు. కానీ వాల్మికీ రామాయణం ప్రకారం.. రాముడు.. వివాహానికి ముందే.. రాక్షసులతో తలపడి యుద్ధం చేసి వారిని సంహరించాడు. అప్పటికే ఆయన శరీరం ఓ యోధుడి మాదిరి రాటుదేలి ఉంది. 21 ఏళ్లు అంటే యువరాజుగా పట్టాభిషేకానికి సిద్ధపడే వయసు. అంటే.. అప్పటికే రాముడు అన్ని యుద్ధ విద్యాల్లో ఆరితేరి.. అసామన యోధుడిగా మారాడు. ఆయన రూపం చూస్తే ఎంతటి శత్రువైన.. భయంతో పరుగులు పెట్టాల్సిందే.
అంతటి ధీశాలని… ఏఐ.. ముక్కుపచ్చలారని.. ఇంకా బాల్య ఛాయలు పోని పసివాడిగా చూపించింది. దాన్నే మనం మహా ప్రసాదం అనుకుంటూ.. ఓ తెగ షేర్ చేస్తున్నాం. మనకు తెలియకుండానే.. మన రాముడి గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాం. ఇలాంటి ఫొటోలు, వీడియోలను చూసనప్పుడు.. అసలు ఆయా వ్యక్తుల గురించి మన పురాణాలు ఏం చేబుతున్నాయి.. ఎలా వర్ణించాయి అన్న విషయం తెలుసుకోవడం ముఖ్యం. ఇక్కడ ఏఐ తప్పు ఎంత మాత్రం లేదు. ఇది కేవలం తన ఊహ మాత్రమే అన్నది. కానీ మనమే వాస్తవాలు తెలుసుకోకుండా.. తొందరపడ్డాం. ఇక మీదట ఇలాంటి వార్తలు, ఫొటోలు వస్తే.. గుడ్డిగా నమ్మి.. సోషల్ మీడియాలో వైరల్ చేయకుండా.. వాస్తవాలు గ్రహించి.. నిజాలు తెలుసుకోవాలని హిందూ పండితులు సూచిస్తున్నారు. మరి ఏఐ క్రియేట్ చేసిన రాముడి ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి