ఒక డంపింగ్ యార్డ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ మంటలతో నగరం గ్యాస్ ఛాంబర్లా మారింది. ఈ ఘటనపై ఎన్జీటీ సీరియస్ అయ్యింది.
కేరళలోని ఒక డంపింగ్ యార్డ్ దగ్గర జరిగిన అగ్నిప్రమాద ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్టీజీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యానికి గానూ కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్‌కు భారీ జరిమానా విధించింది. కొచ్చి శివారులోని బ్రహ్మపురం ప్రాంతంలో ఒక భారీ చెత్తకుప్ప దగ్గర మార్చి 2వ తేదీ సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి వేగంగా వ్యాపించడంతో నేవీ అధికారులు రంగంలోకి దిగారు. వారు సహాయక చర్యలు చేపట్టారు. మూడ్రోజుల పాటు శ్రమించి మార్చి 5 నాటికి మంటలను పూర్తిగా ఆర్పారు. 30 అగ్నిమాపక యంత్రాలు, 14 భారీ వాటర్ పంపులు, నాలుగు హెలికాప్టర్లతో సహా 350 మంది సిబ్బంది, 150 మంది సహాయక సిబ్బంది ఈ మొత్తం ఆపరేషన్‌లో శ్రమించారు.
ఈ అగ్ని ప్రమాదం వల్ల వెలువడిన పొగ కొచ్చి అంతటా దట్టంగా కమ్మేసింది. విషపూరిత వాయువుల వ్యాప్తితో సిటీ ఓ గ్యాస్ ఛాంబర్‌గా మారిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫలితంగా కొచ్చిలో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మార్గదర్శకాలు జారీ చేయాల్సి వచ్చింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. మాస్కులు ధరించాలని సూచనలు చేసింది. శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడేవారి కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపులు, ఆక్సిజన్ పడకలను కూడా అందుబాటులో ఉంచింది. కొచ్చిలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీటీవీ నిఘా లేదు.
బ్రహ్మపురం వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆ డంపింగ్ యార్డ్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటోంది. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్లాంట్‌ను క్లోజ్ చేశారు. ఈ ప్రమాదం కొచ్చిలో సంక్షోభ తరహా పరిస్థితులకు దారి తీసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ఈ అగ్ని ప్రమాదంపై ఎన్‌జీటీ సుమోటో కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. చెత్తకుప్పల దగ్గర అగ్ని ప్రమాదాలను నిరోధించడంలో కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు విఫలమైనందుకు ఏకంగా రూ.100 కోట్లు జరిమానా విధించింది. ఈ మేరకు ఎన్‌జీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పర్యావరణ పరిహారాన్ని నెల రోజుల్లోగా కేరళ చీఫ్ సెక్రటరీకి జమ చేయాలని ఎన్‌జీటీ ఛైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ ఆదేశాలు జారీ చేశారు.