చాలా మంది విద్యార్థులు వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటూ ఉంటారు. ప్రైవేటు హాస్టల్స్ అయితే వసుతుల విషయంలో దాదాపుగా ఎలాంటి ఫిర్యాదులు ఉండకపోవచ్చు. ఎందుకంటే పిండి కొద్ది రొట్టే అన్నట్లు మీరు కట్టే ఫీజులకు తగ్గట్లుగా అక్కడ వసతులు ఉంటాయి. అదే ప్రభుత్వ వసతి గృహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని వసతుల కోసం నిధులు విడుదల చేస్తున్నా కూడా చాలా మంది వార్డెన్‌లు వాటిని వినియోగించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అధికారులు సోదాలకు వెళ్లినప్పుడు మాత్రం విద్యార్థులతో అబద్ధాలు ఆడిస్తూ ఉంటారు. అలాంటి వార్డెన్ కు ఈ బాలికలు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఝార్ఖండ్ రాష్ట్రం సింగ్‌భూమ్ జిల్లా ఖుంట్‌పాని కస్తూర్బా గాంధీ గురుకల పాఠశాలలో ఓ ఘటన జరిగింది. ఆ పాఠశాల వసతిగృహంలో ఉండే బాలికలు సాహసం చేశారు. వారి హాస్టల్ వార్డెన్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. వసతి గృహంలో ఉండే జూనియర్లు, సీనియర్లు మొత్తం 60 మంది బాలికలు డిప్యూటి కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలనుకున్నారు. డిప్యూటీ కమిషనర్ చైబాసాలో ఉంటారు. అక్కడికి వెళ్లాలి అంటే ఏం చేయాలో వారికి తెలియలేదు. ఇంక అందరూ కలిసి నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్నదే తడవుగా.. రాత్రిపూట 60 మంది నడక మొదలు పెట్టారు. తెల్లవారే సరికి చైబాసాలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరవుపెట్టారు. వారికి పాడైన ఆహారం పెడుతున్నారని, నేలపైనే పడుకోవాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. టాయిలెట్స్ కూడా విద్యార్థినులతోనే క్లీన్ చేయిస్తున్నారని తెలిపారు. అధికారులు ఎవరైనా వసతిగృహానికి వచ్చినప్పుడు మాత్రం అన్ని వసతులు బాగానే ఉన్నాయని అబద్ధాలు చెప్పాలని ఒత్తిడి చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయాలు విన్న డిప్యూటీ కమిషనర్ అనన్య మిట్టల్.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా విద్యాశాఖ సూపరింటెండెంట్ కు ఆదేశాలు జారీ చేశారు. బాలికలతో మాట్లాడిన డీఎస్‌ఈ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామంటూ హామీ ఇచ్చారు. అలాగే వారు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసేందుకు వెంటనే ఓ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. విచారణ తర్వాత వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకుంటామంటూ బాలికలకు హామీ ఇచ్చారు. డిప్యూటీ కమిషనర్, డీఎస్‌ఈ భరోసా ఇవ్వడంతో బాలికలు తిరిగి వెళ్లారు. రాత్రంతా బాలికలు నడుచుకుంటూ వెళ్లారని తెలియడంతో ఈ వార్త రాష్ట్రమంతా సంచలనం రేపింది.