కర్ణాటకలో రాజకీయ విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఎగిసిపడుతున్నాయి. ముఖ్యమంత్రి యడ్డ్యూరప్పకు సొంత పార్టీ నేతల వ్యవహారం పెద్ద తల నొప్పిగా మారినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి సీఎం యడ్డ్యూరప్పను తొలగించాలని తెర వెనకాల పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలల నుంచి సీఎం రాజీనామా చేస్తున్నారంటూ వార్తలు కోడై కూస్తున్నాయి. ఏకంగా జాతీయ మీడియాలో సైతం యడ్డీ రాజీనామాపై వరుస కథనాలు వెలువడుతుండటం చర్చనీయాంశం అవుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం యడ్డ్యూరప్ప నెలకొసారి హస్తినాకు వెళ్లిరావటంతో నిజంగానే రాజీనామా చేస్తున్నారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక తాజాగా ఢిల్లీ పర్యటనకు తనయుడి విజయేంద్రతో సహా వెళ్లారు సీఎం యడ్డ్యూరప్ప. వీరి పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు సీఎం. ప్రధానితో పాటు బీజేపీ అగ్రనేతలైన జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాధ్ సింగ్ లను కూడా కలిశారు. ఇదిలా ఉంటే ప్రధానితో గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలు తెర మీదకు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు సీఎం యడ్డ్యూరప్ప.
ప్రధానంగా ఆయన రాజీనామాపై వస్తున్న వార్తలపై పెదవి విప్పారు సీఎం. నేను రాజీనామా చేస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. నాపై లేనిపోని ఆరోపణలు సృష్టిస్తున్నారని, అవన్ని అవాస్తవాలన్ని అన్నారు. ఇక వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీతో మరో మారు సమావేశం కానున్నామని అన్నారు సీఎం. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి కోసం మాత్రమే ప్రధానితో సమావేశమయ్యామని తెలిపారు. ఇక 2023 లో జరిగే ఎన్నికల్లో బీజేపీని రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశపైనే చర్చలు జరిగాయని అని తెలిపారు సీఎం యడ్డ్యూరప్ప.