మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ.. అంతరిక్షంలోకి సైతం దూసుకెళ్తున్న రోజులు ఇవి. తాము వంట గదికే పరిమితం కాదని ప్రపంచంతోనే పోటీ పడుతూ.. ఉద్యోగాల్లోనూ మాకు తిరుగులేదని సత్తా చాటుతున్నారు. అయినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. కుటుంబ భారాన్ని మొత్తం తన భుజాలపై వేసుకున్న ఓ యువతి వ్యవసాయం చేస్తోంది. ఈ క్రమంలో ట్రాక్టర్ నడుపుతూ వ్యవసాయం చేస్తుందని.. దీని వల్ల గ్రామానికి చెడు జరుగుతుందని నమ్మిన గ్రామస్థులు.. ఆమెను బహిష్కరించారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని గుమ్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఝార్ఖండ్‌లోని దహుటోలి గ్రామంలో మంజు ఒరాన్ అనే యువతి.. గుమ్లాలోని కార్తీక్ ఒరాన్ కాలేజీలో బీఏ పార్ట్ వన్ చదువుతోంది. ఈ యువతి కుటుంబ సభ్యులు వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారు. గత కొంత కాలంగా వ్యవసాయాన్ని సాంప్రదాయపద్దతుల్లో కొనసాగిస్తున్నారు. వీరికి నీటి పారుదల సౌకర్యాలు, సరికొత్త వ్యవసాయ పద్ధతులపై ఎంతమాత్రమూ అవగాహన లేదు. డిగ్రీ చదువుతున్న మంజు ఒరాన్ వ్యవసాయన్ని నూతన పద్దతులతో చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం గ్రామంలో మరో పదెకరాల భూమిని ఆ కుటుంబం కౌలుకు తీసుకొని మంచి లాభాలు రాబడుతున్నారు.
ఇటీవల మంజు ఓ పాత ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి.. స్వయంగా పొలాన్ని దున్నుతోంది. ఇది గమనించిన గ్రామస్థులు.. మహిళలు ట్రాక్టర్ నడపితే అరిష్టం అని… దీని వల్ల గ్రామంలో కరువు వస్తుందని నమ్మారు. వెంటనే ట్రాక్టర్ తో పొలాన్ని దున్నడం నిలిపివేయాలని ఆమెను వారించారు. అంతేకాదు గ్రామ కట్టుబాట్లను ఉల్లంఘించినందుకు జరిమానా విధించారు. పంచాయతీ నిబంధనలను అతిక్రమించినందుకు మంజును గ్రామ బహిష్కరణ చేయాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా మంజు ఒరాన్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం తాను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాని.. తనకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టమని.. తన తల్లిదండ్రులకు సహాయంగా ఉండటం తప్పగా భావించడం లేదని.. గ్రామ పంచాయతీ విధించిన షరతులను తాను అంగీకరించబోనని.. వ్యవసాయం చేయడాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేసింది.’ ఓవైపు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయ్యిందంటూ.. సంబరాలు చేసుకుంటుంటే.. మనం ఇంకా ఎక్కడ ఉన్నామని ఇలాంటి కొన్ని ఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.