ఇటీవల ఝార్ఖండ్ లో ఏనుగులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో పంటపొలాల మీదనే దాడులు చేసేవి.. కానీ ఈ మద్య గ్రామాల్లోకి వచ్చి మనుషులపై దాడులు చేసి చంపేస్తున్నాయి.. దీంతో ప్రాణ భయంతో ప్రజలు వణికిపోతున్నారు.
సాధారణంగా అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న పంటపొలాలను ఏనుగులు ధ్వంసం చేయడం చూస్తుంటాం. కానీ ఈ మద్య ఏనుగులు పంట పొలాలను మాత్రమే కాదు.. గ్రామాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. అటవీ అధికారులు వీటిని తరిమేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కొన్నిసార్లు ఏనుగుల దాడుల్లో మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఏనుగుల భయంతో గ్రామాల్లో నివసిస్తున్నవారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఝార్ఖండ్ రాష్ట్రంలోని 5 జిల్లాల్లో ఓ ఏనుగు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తున్న ఓ ఏనుగు కనిపించిన వారినల్లా చంపుకుంటూ పోతుంది. వివరాల్లోకి వెళితే..
ఝార్ఖండ్ లో రాష్రంలో 5 జిల్లాలు అయిన రాంచీ, రామ్ గఢ్, హజారీబాగ్, చతరా, లోహర్ దగా జిల్లాలో కొన్నిరోజులుగా ఓ ఏనుగు ప్రజలను హడలెత్తిస్తుంది. ఒక్క రాంచీలోనే మంగళవారం నలుగురిని చంపింది. 12 రోజుల్లో ఏనుగు 16 మందిని చంపేసింది. దీంతో ఇటకీ బ్లాకు లో అధికారులు 144 సెక్షన్ విధించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని.. ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం వేల బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతే కాదు ఎనుగు సంచరిస్తున్న ప్రాంతం వైపు ఎవరూ వెళ్లకూడదని తెలిపారు. ఆ ఏనుగును అడవుల్లోకి తరలించేందుకు పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి నిపుణుల బృందాన్ని రప్పిస్తున్నట్లుగా అటవీ అధికారి శశి కుమార్ తెలిపారు.
ఏనుగు దాడిలో మృతి చెందిన వారికి ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం అందచేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏనుగు నుంచి రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. ప్రజలు కూడా సహకరించాలని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఆయా జిల్లాల్లో 14 సెక్షన్ అమలు తీసుకువచ్చామని అన్నారు. ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఏనుగు ఎప్పుడు వస్తుందో ఎక్కడ నుంచి దాడి చేస్తుందో అని స్థానికులు భయంతో వణికిపోతున్నారు. గత కొంత కాలంగా ఝార్ఖండ్ లో ఏనుగుల బీభత్సం కొనసాగుతూనే ఉంది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ వారు విడుదల చేసిన ప్రకారం 2017 నుంచి ఇప్పటి వరకు 462 మంది ఏనుగుల దాడిలో మృత్యువాత పడ్డారు.