Ramagundam Solar Plant: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం జలాశయం మీద నిర్మించిన సోలార్ ప్రాజెక్టు ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా అవతరించింది. రామగుండం ఎన్టీపీసీ జలాశయం నీటిపై నిర్మించిన 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు దేశాన్ని తనవైపు తిప్పుకుంది. ఎన్టీపీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాదాపు 423 కోట్ల వ్యయంతో రెండేళ్ళలో ప్రాజెక్టును పూర్తి చేసింది. రామగుండం ఎన్టీపీసీ జలాశయ సామర్థ్యం మొత్తం 4 వేల ఎకరాలు. దాదాపు 1000 ఎకరాల్లో నీరు ఎప్పుడూ నిల్వ ఉంటుంది. 1000 ఎకరాల్లో నిల్వ ఉన్న నీరును దృష్టిలో పెట్టుకొని.. 400 ఎకరాల విస్తీర్ణం గల నీటిపై సౌర విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని చేపట్టారు.
హై డెన్సిటీ పాలిథిలిన్‌తో తయారు చేసిన ఫ్లోటర్ల పైన సోలార్ ప్యానెల్స్‌ను అమర్చారు. ఈ ప్రాజెక్టును 40 బ్లాకులుగా డివైడ్ చేశారు. ప్రతీ బ్లాకులో కనీసంగా 11,200 సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. ఒక్కో బ్లాకులో 2.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ప్రణాళికలు రచించారు. క్రిస్టలిక్ సిలికాన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఫొటో వోల్టాయిక్ ప్యానల్స్ ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. సోలార్ ప్యానెల్స్, ఇన్వర్టర్ గదులు, ట్రాన్స్ ఫార్మర్లు, హెచ్‌టీ బ్రేకర్లు నీటిపై తేలియాడేలా పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టుతో రోజుకు 5 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అందులో 2 లక్షల యూనిట్లను గోవా రాష్ట్రానికి, మిగతా 3 లక్షల యూనిట్లను మార్కెటింగ్ చేస్తున్నారు.
అసలు ఈ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టక ముందే డ్రైడాక్ స్టింగులు ఏర్పాటు చేయడం విశేషం. రామగుండంలోని ఎన్టీపీసీ యాజమాన్యం రానున్న ఐదేళ్ల కాలంలో.. 50 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ సౌర విద్యుత్ కేంద్రానికి ఎలాంటి భూసేకరణ సమస్య ఉండదు. నీరు కూడా ఆవిరయ్యే అవకాశాలు తక్కువ. నీటి మీద సౌర ఫలకాల ఏర్పాటుతో జలాశయం మరింత ఆకర్శణీయంగా మారింది. ఎన్టీపీసీ యాజమాన్యం పర్యావరణ రహిత ప్రాజెక్టులే లక్ష్యంగా పని చేయడం విశేషం.
ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన ఈ ప్రాజెక్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. వర్చువల్ పద్ధతిలో ఈ 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ఉజ్వల్ భారత్ భవిష్య కార్యక్రమంలో భాగంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనే మరో మూడు కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు వర్చువల్ పద్ధతిలో భూమి పూజను చేశారు. మరి దేశంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుగా నిలిచిన రామగుండం సోలార్ ప్రాజెక్టుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.