సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తుంటే.. మనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తుంటాయి. ఆ మద్య ఓ రైల్వే స్టేషన్ లో తల్లి చనిపోయిన విషయం తెలియ ఒక చిన్నారి ఆమె వడిలో ఆడుకుంటూ అమ్మా లే అంటూ లేపడం చూసిన వారి హృదయాలు చలించిపోయాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాంటి ఘటనే రాజస్థాన్ లో చోటు చేసుకుంది. తల్లి చనిపోయిన విషయం రెండేళ్ల చిన్నారికి తెలియ అమ్మా లే అంటూ లేపడం చూసి అక్కడ ఉన్నవారంతా కన్నీరు పెట్టుకున్నారు.
రాజస్థాన్ లోని నైన్వా పట్టణంలోని ఆసుపత్రిలో ఓ మహిళ అనారోగ్యంతో మరణించింది. ఆ మహిళ మృతదేహాన్ని మార్చురీకి తరలించేందుకు ఆలస్యం అయ్యింది. ఈ క్రమంలో తల్లి చనిపోయిన విషయం తెలియక మృతురాలి రెండేళ్ల కూతురు అమ్మా అంటూ గుక్క పెట్టి ఏడ్చింది.. అమ్మా లే అంటూ బెడ్ షీట్ తొలగించే ప్రయత్నం చేసింది. మూడు నెలల పసిబాలుడు అదే మంచంపై ఆడుకుంటున్నాడు.. ఈ దృశ్యం చూసిన అక్కడి వారంతా ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నాడు.
రాజస్థాన్ కి చెందిన షబానా అనే వివాహిత గత శనివారం చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఆమెకు వచ్చిన జబ్బు ఏంటో ఖచ్చితంగా తెలియదని.. పోస్ట్ మార్టం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరారం తెలపలేదని పోలీసులు అన్నారు. ఈ సందర్భంగా షబానా సోదరుడు మాట్లాడుతూ.. కడుపు నొప్పితో బాధపడ్డ తన సోదరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందని.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. పోలీసుల వ్యవహారంపై ఆసహనం వ్యక్తం చేశాడు. చాలా సేపు వార్డులోనే ఉంచారని.. ఆమెకు పోస్ట్ మార్టం విషయంలో చాలా ఆలస్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆమె భర్త హరియానా నుంచి వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం తతంగం పూర్తి చేశారు. సాధారణంగా చట్ట ప్రకారం వివాహం జరిగి ఏడేళ్ల లోపు మహిళ కన్నుమూస్తే ఆమె కుటుంబ సభ్యులు, భర్త అంగీకారం తప్పకుండా తీసుకోవాలని.. షబానాకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది కనుక ఆమె ఇరుకుటుంబాల అనుమతి అవసరం కనుకనే వార్డులో మృతదేహాన్ని ఉంచాల్సి వచ్చిందని హెల్త్ సెంటర్ ఇంచార్జి తెలిపారు. చనిపోయిన షబానాకు ఒక పాప, బాబు ఉన్నారు.