ఇప్పుడు సరికొత్త ప్రేమ కథా చిత్రాలు పుట్టుకువస్తున్నాయి. గతంలోలా వీరికి పెళ్లికి కుల మతాలు అడ్డు గోడలుగా నిలవడం లేదు. సరిహద్దులు చెరిపేసుకుని ప్రేమించిన వ్యక్తుల కోసం అవసరమునుకుంటే కట్టుకున్న భర్తను వదిలేసి వస్తున్నారు.
ఇప్పుడు సరికొత్త ప్రేమ కథా చిత్రాలు పుట్టుకువస్తున్నాయి. గతంలోలా వీరికి పెళ్లికి కుల మతాలు అడ్డు గోడలుగా నిలవడం లేదు. సరిహద్దులు చెరిపేసుకుని ప్రేమించిన వ్యక్తుల కోసం.. అవసరమునుకుంటే కట్టుకున్న భర్తను వదిలేసి వస్తున్నారు. పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ ఇదే రకమైన ప్రేమ కథ. పబ్జీలో పరిచమైన వ్యక్తిని ప్రేమించడమే కాదూ.. అతడి కోసం ఏకంగా ఖండాంతరాలు దాటి భారత్ దేశానికి వచ్చేసింది. భర్తను కాదని తన నలుగురు పిల్లలతో కలిసి అక్రమంగా వచ్చి ఉత్తర ప్రదేశ్‌కు చెందిన యువకుడ్ని పెళ్లి చేసుకుని ఏకంగా కాపురమే పెట్టేసింది. ఇక ఇక్కడి నుండి వెళ్లే ప్రసక్తే లేదని చెబుతుంది. అలాగే బంగ్లాదేశ్, పోలండ్, శ్రీలంక నుండి మహిళలు భారతీయ పోరగాళ్ల కోసం వచ్చేసిన సంగతి విదితమే. ఇవన్నీ కూడా సోషల్ మీడియా ప్రేమలే కావడం విడ్డూరం.
ఇక పోతే ఇప్పుడు మరో పాకిస్తాన్ మహిళ భారత్ రానుంది. ఇండియాలో కాపురం పెట్టేందుకు వస్తుంది. రెండు రోజుల క్రితమే అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. వీసా రాకపోవడంతో ఆన్ లైన్‌లో వీరి వివాహం జరిగింది. ఇది ప్రేమ పెళ్లి అనుకునేరూ..కాదూ పెద్దలు అంతా కలిసి పెళ్లి చేశారు. వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్ జోథ్ పూర్‌కు చెందిన అర్బాజ్ అనే యువకుడు కంప్యూటర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అతడికి పెళ్లి చేయాలని భావించి కుటుంబ సభ్యులు సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన అమీన్‌తో పెళ్లి కుదిర్చారు పెద్దలు. అర్బాజ్ అన్న సియాక్ కూడా పాక్ మహిళనే పెళ్లి చేశారు. దీంతో అతడికి కూడా అక్కడి సంబంధం చూశారు.పెళ్లి తేదీని ఫిక్స్ చేశారు పెద్దలు.
కానీ అమీనాకు వీసా రాకపోవడంతో ఏం చేయాలో తోచలేదు. అలాగే తాము పాకిస్తాన్‌లో పెళ్లి చేసుకుందామంటే.. ఆ వివాహానికి భారత్‌లో చెల్లుబాటు ఉండదు కాబట్టి.. నిర్ణయించిన ముహుర్తానికే ఆన్ లైన్ లో పెళ్లి చేయాలని భావించారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం.. కుటుంబ సభ్యులు, బంధువుల పరివారం మధ్య వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి.. నిఖా చేసుకున్నారు. ఈ పెళ్లిని అందరూ తిలకించేలా పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ పెళ్లి ద్వారా తమ కోడలు ఇండియా వచ్చేందుకు వీలవుతుందని అర్బాజ్ తండ్రి తెలిపారు. కోడలికి వీసా రాగానే భారత్ వస్తుందని చెప్పారు.