అమ్మాయిల పట్ల ఆకర్షితులవ్వడం, చదువుని గాలికొదిలేసి ప్రేమ పాఠాలు నేర్చుకోవడం, పరిధి దాటి ప్రవర్తించడం.. అమ్మాయిలపై లైంగిక దాడులకు పాల్పడడం వంటివి ఇప్పుడు స్కూల్ కాంపౌండ్ లోకి కూడా వచ్చేశాయి. దీంతో అభం శుభం తెలియని పసిపిల్లల్లో లైంగిక ఆలోచనలు ప్రేరేపితమవుతున్నాయి. దీనికి కారణం సినిమాలు కావచ్చు, అశ్లీల వెబ్ సైట్లు కావచ్చు, స్మార్ట్ ఫోన్లు ఏమైనా కావచ్చు. వీటి వల్ల అమ్మాయిలకు ఇష్టం లేకపోయినా ఆమెను అనుభవించాలన్న కోరిక పసి హృదయాల్లో నాటుకుపోతుంది. ఇది పెరిగి పెద్దదై అమ్మాయి అనుమతి లేకపోయినా బలాత్కారం చేసేలా ప్రోత్సహిస్తోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి అమ్మాయిల పట్ల ఎలా ప్రవర్తించాలో అనే విషయంపై పిల్లల పాఠ్య పుస్తకాల్లో ప్రచురించాలని కేరళ హైకోర్టు న్యాయమూర్తి దేవన్ రామచంద్రన్ సూచించారు.
అనుమతి లేకుండా అమ్మాయిలను తాకడం అనేది మంచి పధ్ధతి కాదు. అమ్మాయికి ఇష్టం లేకుండా ఆమెను బలవంతం చేయడం అనేది రాక్షసత్వమే అవుతుంది. ఆమె వద్దు అన్నదంటే వద్దు అని అర్థం. అక్కడితో ఆగిపోవాలి. ఈ విషయాన్ని యువకులు అర్థం చేసుకోవాలని కేరళ హైకోర్టు వెల్లడించింది. కొల్లాంలోని టీకేఎం ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఒక అబ్బాయి వేసిన పిటిషన్ ను పరిశీలించిన జస్టిస్ దేవన్ రామచంద్రన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిల పట్ల సత్ప్రవర్తన, మర్యాద కలిగి ఉండాలనే ప్రాథమిక స్థాయి పాఠ్యాంశాల్లో భాగం చేయాలని జస్టిస్ దేవన్ రామచంద్రన్ సూచించారు. లైంగిక వేధింపుల కేసులు విద్యార్థులపైనే ఎక్కువగా ఉన్నాయని, రాను రాను పెరుగుతున్నాయని, ఎక్కువగా మగ పిల్లలే ఆరోపణలు ఎదుర్కొంటున్నారని న్యాయమూర్తి అన్నారు. అమ్మాయిని గానీ, స్త్రీని గానీ ఆమె అనుమతి లేకుండా తాకకూడదని అబ్బాయిలు గ్రహించాలని, వారు నో అంటే వద్దని అర్థం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
అబ్బాయిలు చాలా చిన్న వయసు నుంచే సెక్సిస్ట్ మూస పద్ధతులతో పెరుగుతారని, సోషల్ మీడియా ప్రభావం, అలానే సమాజంలోని కొంతమంది ప్రభావం విద్యార్థులపై ఉంటుందని అన్నారు. ఒక అమ్మాయిని, స్త్రీని గౌరవించడం, ఆమె పట్ల మర్యాదగా నడుచుకోవడం పాత పధ్ధతి ఏమీ కాదని.. ఇది అన్ని కాలాల్లో ఆచరించవలసిన ధర్మం అని అన్నారు. పురుషాధిక్య ప్రాచీన భావనలు మారాయి. సమాజంలో మహిళలు సగ భాగం. మిగిలిన సగ భాగానికి జన్మనిచ్చేది మహిళే. కాబట్టి సమాజం అంటే మహిళలే అని ఇస్లామిక్ వేదాంత వేత్త, ఆధ్యాత్మిక రచయిత ఇబ్న్ ఖయ్యుమ్ అల్ జౌజియా కవితను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
నిజమే కదా.. అమ్మాయి అంటే భవిష్యత్తులో కాబోయే తల్లి, అంటే మరొక మనిషిని సృష్టించే అద్భుతం. అలాంటి అద్భుతాన్ని ఆమెకు ఇష్టం లేకపోయినా మధ్యలోనే నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? అమ్మాయి వద్దు అన్నదంటే వద్దు అని అర్థం.. అది అబ్బాయిలు తెలుసుకోవాలి అని చెప్పిన కేరళ హైకోర్టు జస్టిస్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.