ఫ్రెంచ్ దేశస్థులు.. భారత దేశాన్ని విడిచి వెళ్లిపోయినా.. ఇక్కడి మనుషులతో అనుబంధాలను కొనసాగిస్తున్నారు. ఆ బంధాన్ని ఇప్పుడు మరింత ధృఢంగా మలచుకుంటున్నారు. ఇటీవల కాలంలో 30 మందికి పైగా యానాం యువతీ యువకులు ఫ్రెంచ్ వారిని వివాహం చేసుకున్నారు.
ఇటీవల ప్రేమ పెళ్లిళ్లకే కాదూ.. పెద్దలు కుదర్చిన వివాహాలకు హద్దులు, ఎల్లలు ఉండటం లేదు. పెళ్లిళ్లు ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి ఖండాంతరాలకు చేరుతున్నాయి. కుల మతాలు, వర్ణాలు పట్టింపు లేకుండా పెద్దలు వివాహం చేయడం చాలా అరుదు. కానీ అలాంటి దృశ్యాలు ఇటీవల భారత్‌లోని కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో కనిపిస్తున్నాయి. 1954 వరకు యానాంను పరిపాలించిన ప్రెంచ్.. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లినా.. ఇక్కడి వారితో సంబంధ బాంధవ్యాలను విడిచిపెట్టలేదు. ఇప్పుడు అవి మరింత బలమైన బంధంగా మారుతున్నాయి. ఇక్కడి యువతీ యువకులు.. ఫ్రెంచ్ వాసులను వివాహం చేసుకోవడానికి ఆసక్తి కనబరచడమే అందుకు కారణం. ఏడాదికి కనీసం మూడుకు పైగా వివాహాలు ఫ్రెంచ్ దేశస్థులతో జరుగుతున్నాయట. ఇవన్నీ పెద్దలు కుదిర్చిన వివాహాలు కాగా, అందులోనూ హిందూ సంప్రదాయం ప్రకారం జరగుతుండటం విశేషం.
కాకినాడ–కోనసీమ జిల్లాల నడుమ జాతీయ రహదారిని ఆనుకుని ఉండే యానాం పట్టణం కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి పరిధిలో ఉంది. ఇప్పుడు ఈ యానాం పెళ్లిళ్లతో వార్తల్లో నిలుస్తుంది. అవి మామూలు పెళ్లిళ్లు కాదూ.. ఖండాంతరాల పెళ్లిళ్లు. యానాంకు చెందిన దవులూరు చంద్రశేఖర్.. ఫ్రెంచ్ యువతి షావలోత్ భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి పీటలెక్కారు. హిందూ సంప్రదాయంలో ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో.. అలాగే వీరిద్దరు వివాహం చేసుకున్నారు పెద్దల సమక్షంలో. మంగళ వాయిద్యాలు,పచ్చ తోరణాలు, జీలకర్ర బెల్లం, తాళి , అరుంధతి నక్షత్రం దర్శించడం, అప్పగింతలు వంటివి జరిగాయి. ఇటీవల కాలంలో యానాంలో ఇటువంటి పెళ్లిళ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 30 మందికి పైగా పారిస్ పౌరులను మన సంప్రదాయం ప్రకారమే వివాహమాడారు. వీరిలో మంచాల, బెజవాడ, దవులూరు, చింతా, కామిశెట్టి, సలాది వంటి కుటుంబాలకు చెందిన వారున్నారు.
ఇక్కడి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అంగరంగ వైభవంగా వివాహాలు చేసుకోవడానికే ఫ్రెంచ్ పౌరులు మక్కువ చూపుతున్నారు.పెళ్లికి ముందు జాతకాలు, ఫొటోలు ఇచ్చిపుచ్చుకోవడంతోపాటు ఇరు కుటుంబాల మధ్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏటా మాఘమాసంలో కేంద్రపాలిత ప్రాంతాలైన యానాం, పాండిచ్చేరి, మాహే, కారైకల్ ప్రాంతాలకు చెందిన కనీసం పది జంటలు వివాహ బంధంతో ఒక్కటవుతూ అనుబంధాల్ని పెనవేసుకుంటున్నాయి. ఫ్రెంచ్ యువతీ యువకులను వివాహం చేసుకుంటే ఓ అరుదైన అవకాశం కూడా లభిస్తుంది. ఫ్రెంచ్ పాస్‌పోర్టుతో వీసా లేకుండా ప్రపంచ దేశాలు చుట్టి రావచ్చు. కెనడా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా తదితర 25కు పైగా దేశాలకు వీసా లేకుండా స్వేచ్ఛగా వెళ్లిరావచ్చు. పైగా ఫ్రెంచ్ ప్రభుత్వం అమలు చేసే పథకాలను, ప్రయోజనాలను అనుభవిస్తూ హాయిగా జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లిళ్ల న్యూస్ వైరల్ గా మారుతోంది.