సుప్రీంకోర్టు చరిత్రలో నూతన ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. అంతేకాదు, తొలిసారిగా న్యాయమూర్తుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేశారు. ఎప్పుడూ రాష్ట్రపతి భవన్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారం మాత్రమే ప్రత్యక్షప్రసారం చేసేవారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం సిఫారుసులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మంగళవారం నూతన న్యాయమూర్తులతో సీజీఐ జస్టిస్ ఎన్.వి.రమణ ప్రమాణం చేయించారు. ముగ్గురు మహిళా న్యాయమూర్తులు సహా మొత్తం తొమ్మిది మంది న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. నూతన న్యాయమూర్తులతో కలిపి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది.
నూతనంగా బాధ్యతలు తీసుకున్న న్యాయమూర్తులు: జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓక్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ ఎం.ఎం. సురేష్, ప్రముఖ సీనియర్ న్యాయవాది పి.ఎస్.నరసింహ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కోర్టు-1 ప్రాంగణంలో ప్రమాణస్వీకార కార్యక్రమం చేయాలని అనుకోగా.. కరోనా నిబంధనల కారణంగా అదనపు భవనం ఆడిటోరియానికి కార్యాక్రమాన్ని మార్చారు.