తండ్రి ఓ కేసులో అనుమానితుడిగా జైలుకు వెళ్ళాడు. అప్పుడు తన కొడుకు వయసు మూడేళ్లే. మళ్ళీ తండ్రి జైలు నుంచి విడుదలయ్యాక కొడుకు ఎక్కడ ఉంటాడో తెలియదు. కొడుక్కి తన తండ్రి ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ ఇద్దరూ ఒక మంచి కార్యక్రమం ద్వారా అనుకోకుండా కలుసుకున్నారు.
ఝార్ఖండ్ లోని రామ్ గఢ్ పట్టణంలో డివైన్ ఓంకార్ మిషన్ అనే సంస్థ స్థానికంగా ఒక అనాథాశ్రమాన్ని నిర్వహిస్తుంది. పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలో శుక్రవారం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇదే ఆశ్రమంలో శివమ్ (13) అనే 8వ తరగతి విద్యార్థి ఉంటున్నాడు. చిన్నప్పటి నుంచి ఇదే ఆశ్రమంలో పెరుగుతూ వచ్చాడు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ చురుగ్గా పాల్గొంటాడు. ఈసారి కూడా ఎప్పటిలానే అందరికీ భోజనం వడ్డించడం మొదలుపెట్టాడు. ఇంతలో గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి ఈ కుర్రాడ్ని చూసి ఆగిపోయాడు. శివమ్ కూడా ఆ వ్యక్తిని అలానే చూస్తూ ఉండిపోయాడు. తన దగ్గర ఉన్న ఫోటోలో ఉన్న వ్యక్తి, ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తి ఒకలానే ఉండడంతో ఎగిరి గంతులు వేశాడు.
ఎందుకంటే అతను మరెవరో కాదు తన తండ్రే. పదేళ్ల క్రితం జైలుకు వెళ్ళాడు. తన తండ్రిని అలా చూసేసరికి ఆ కుర్రాడు గట్టిగా హత్తుకుని ఏడ్చేశాడు. ఇటు తండ్రి టింకు వర్మ కూడా తన కొడుకుని ఎత్తుకుని ముద్దాడాడు. శివమ్ కి మూడేళ్ళ వయసున్నప్పుడు తల్లి అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే ఈ కేసులో టింకు వర్మను అనుమానిస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు. శివమ్ సంరక్షణ బాధ్యతను ఓంకార్ మిషన్ ఆశ్రమానికి అప్పగించారు. కట్ చేస్తే టింకు వర్మ జైలు నుంచి విడుదలయ్యారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే అనుకోకుండా శివమ్ ఉంటున్న అనాధాశ్రమానికి భోజనం చేయడానికి టింకు వర్మ రావడం, అక్కడ తన కొడుకుని గుర్తు పట్టడం ఏదో ఒక మాయలా జరిగిపోయింది.
జీవితంలో తండ్రిని కలుస్తానని ఆ కుర్రాడు అనుకోలేదు. కానీ దేవుడు తమ ఇద్దరినీ కలిపాడని శివమ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తన బాల్యమంతా ఆశ్రమంలోనే గడిచిందని.. అయితే ఇప్పుడు తన తండ్రితో వెళ్ళిపోతున్నందుకు ఆశ్రమంలో ఉన్న స్నేహితులను మిస్ అవుతున్నానని అన్నాడు. పదేళ్ల పాటు తన కొడుకును జాగ్రత్తగా చేసుకున్నందుకు ఆశ్రమానికి టింకు వర్మ కృతజ్ఞతలు తెలియజేశారు. విధి ఎంత విచిత్రమైందో కదా.. ఎప్పుడు మూడేళ్ళ క్రితం తండ్రికి దూరమైన కుర్రాడి దగ్గరకు నాన్నను దగ్గర చేసింది. సినిమాని తలపించే ఈ సంఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.