బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అనంతరం ఊహాతీతమైన మలుపుల గురించి తెలిసినదే. మర్డర్ మిస్టరీగా ప్రారంభమైన ఈ కేసులో ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయి. సుశాంత్ సింగ్ ఆత్మహత్య అనంతరం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన బాలీవుడ్ డ్రగ్ కేసులో చిక్కుకుంది. బడా స్టార్స్ అందరినీ ఎన్సీబీ విచారించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రముఖ కథానాయికల పేర్లు ఇందులో వినిపించడం సంచలనంగా మారింది. ఈ కేసుని విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు కథానాయిక దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్ అన్ ట్రేసిబుల్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే.
డ్రగ్స్ కేసులో సమన్లు జారీ చేసినా దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ స్పందించకపోవడంతో ఆమె కోసం ఎన్సీబీ వెతుకుతోందని జాతీయ మీడియా కథనాలు పేర్కొనడం అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా బాలీవుడ్ నటి దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్ ముందస్తు అరెస్టు బెయిల్ పిటిషన్‌ను ఎన్‌డిపిఎస్ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి, దీపికా పదుకునే, ఆమె మేనేజర్, సారా అలీఖాన్ వంటి ప్రముఖులు విచారణకు హాజరయ్యారు. అప్పట్లో వారి వాట్సప్ చాట్స్ లీక్ అవ్వడం అందరినీ షాక్ కు గురి చేసింది. ఆ ప్రకంపనలు ఇంకా తగ్గినట్లు అన్పించడం లేదు.
అప్పుడు బయటపడ్డ డ్రగ్స్ కోణంపై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. అరెస్టు భయంతో కరిష్మా గత ఏడాది అక్టోబర్‌లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసింది. డిఫెన్స్ మరియు ప్రాసిక్యూషన్ సమర్పణలను విన్న తరువాత, ప్రత్యేక న్యాయమూర్తి వివి విద్వాన్స్ ప్రకాష్ దరఖాస్తును తిరస్కరించారు. అయితే కరీష్మా ప్రకాశ్ బాంబే హైకోర్టును ఆశ్రయించే విషయంపై ఆగస్టు 25 వరకు కోర్టు స్టే ఇచ్చింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాదకద్రవ్యాల విక్రయదారులు, వారితో బాలీవుడ్ ప్రముఖుల సంబంధాలపై దర్యాప్తు చేస్తోంది.
గత ఏడాది జూన్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పుడు ఇది వెల్లడైంది. రాజ్‌పుత్ మరణంపై కూడా సిబిఐ విడిగా దర్యాప్తు చేస్తోంది. ఓ డ్రగ్ పెడ్లర్ అరెస్ట్ అయ్యి, విచారణ సమయంలో ఆమె పేరు చెప్పడంతో కరీష్మా ప్రకాష్ పేరు తెరపైకి వచ్చింది. డ్రగ్స్ కేసులో సెంట్రల్ ఏజెన్సీ ఇప్పటివరకు 20 మందికి పైగా అరెస్ట్ చేసింది. రియా చక్రవర్తితో సహా చాలా మంది నిందితులు బెయిల్‌పై ఉన్నారు.