గత కొంత కాలంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. ఇప్పటికే ఆయన సీబీఐ ఎదుట పలుమార్లు హాజరైన విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం ఏప్రిల్ 17 వ తేదీన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ పిటీషన్ పై విచారణలో ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చింది. మొత్తానికి సుప్రీం కోర్టు జోక్యంతో ఆయనకు ఊరట లభించింది.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హై కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ ఎదుట అవినాష్ రెడ్డి ఇప్పటి వరకు ఏడుసార్లు హాజరయ్యారు. ఇటీవల ఆయన తల్లి అనారోగ్యం కారణంగా ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కాలేదు. సీబీఐ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని.. ప్రస్తుతం తల్లి బాగోగులు చూసుకోవడానికి గడువు కోరుతున్నట్లు సీబీఐకి విజ్ఞప్తి లేక రాశారు. ఈ విషయాన్ని అవినాష్ రెడ్డి లాయర్లు న్యాయస్థానంలో వినిపించారు. అవినాష్ రెడ్డి లాయర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్ట్ బెంజ్.. కొన్నిషరతులతో కూడి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
అంతేకాదు వివేకానందరెడ్డి కేసులో అవినాష్ రెడ్డి కస్టడీ విచారణ అవసరం లేదని హైకోర్ట్ బెంజ్ సీబీఐ తరుపు లాయర్లకు స్పష్టం చేసింది. కాగా, సీబీఐ విచారణ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ కావాలని అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై ఈ నెల 27న హైకోర్టు లో వాదనలు ముగించిన విషయం తెలిసిందే. ఈ నెల 26 నుంచి శనివారం వరకు ఇరు పక్షాల న్యాయవాదులు తమ వాదనలు కోర్టుకు వినిపించారు. ఈ క్రమంలో న్యాయవాది జస్టిస్ ఎం. లక్ష్మణ్ తుది ఉత్తర్వులు 31న, బుధవారం రోజు తీర్పు వెల్లడిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇక షరతుల విషయానికి వస్తే.. సీబీఐ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో దేశం విడిచి పోవడానికి వీలు లేదు. ఈ కేసులో ఉన్న సాక్షులను ప్రభావితం చేయకూడదు.. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ ఎదుట తప్పకుండా హాజరు కావాలని స్పష్టం చేసింది. అంతేకాదు దర్యాప్తునకు పూర్తిగా సహకరించాల్సిందిగా సూచించింది. ఒకవేళ ఏ పరిస్థితిలో అయినా ఆయనను అరెస్ట్ చేస్తే రూ.5 లక్షల పూచీకత్తుతో బెయిల్ పై విడుదల చేయాలని సీబీఐని ఆదేశించింది. షరతులను ఉల్లంఘించినట్లయితే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరవచ్చు అని కోర్టు స్పష్టం చేసింది.