దేశంలో కరోనా ప్రభావం ఎంత దారుణ మారణ కాండ సృష్టించిందో అందరికీ తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ ముగిసిందనుకునేలోపే ఇప్పుడు థార్డ్ వేవ్ ముప్పు రానే వచ్చింది. అయితే కరోనా థార్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా చిన్నారులపై పడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలం.. వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.. రక రకాల వైరస్‌లు కబళిస్తుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని డెంగీ ఫీవర్ వణికిస్తుంది. ఫిరోజాబాద్‌లో గత 10 రోజుల్లో సుమారు 53 మంది మరణించారు. వారిలో 45 మంది చిన్నారులే ఉన్నారు. అయితే వీరంతా డెంగీ వ్యాధితో మరణించినట్లు భావిస్తున్నారు. ఫిరోజాబాద్ జిల్లాలో చాలామంది చిన్నారులు తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి డెంగీ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న పరిస్థితి నెలకొంది.
గత పదిపన్నెండు రోజుల నుంచి పిల్లల్లో డెంగీ లక్షణాలు మరింత పెరిగాయి. జ్వరంతో బాధపడుతున్న పిల్లలు హాస్పిటళ్లకు పోటెత్తుతున్నారు. చిన్న పిల్లలు వైరల్ జ్వరంతో బాధపడుతున్నారని, కొందరు డెంగీ పరీక్షలో పాజిటివ్‌గా తేలుతున్నట్లు పీడియాట్రిక్ డాక్టర్ ఎల్‌కే.గుప్తా తెలిపారు. ఆగ్రా, మధుర, మైన్‌పురి, ఇతా, కసగంజ్, ఫిరోజాబాద్ జిల్లాలో ఈ డెంగీ మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఇలా తీవ్ర జ్వరం బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న చాలామందిలో ప్లేట్‌లేట్స్ పడిపోవడంతో డెంగీ వైరస్ వలనే అస్వస్థతకు గురవుతున్నట్లు వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్‌లో 186 మంది చికిత్స పొందుతున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేయాలని జిల్లా మెజిస్ట్రేట్ చంద్రా విజయ్ సింగ్ ఆదేశించారు.
ఫిరోజాబాద్ హాస్పిటల్‌ను సీఎం యోగి ఆదిత్యనాథ్ సందర్శించారు. అయితే డెంగీతో ఒకేసారి ఇంతమంది ఇంత తక్కువ వ్యవధిలో చనిపోవడం గతంలో ఎన్నడూ జరగలేదు. అది కూడా ఎక్కువ మంది చిన్నారులే ప్రాణాలు కోల్పోతుండటం కూడా గమనించాల్సిన విషయం. ఇక ‘ఈడిస్ ఈజిప్టై’ అనే ఒక రకం ఆడదోమ కుట్టడం ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. పగటిపూట ఈ దోమ కుడితే కొద్ది రోజుల్లోనే డెంగీ బారిన పడతాం. డెంగీ జ్వరం వస్తే శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. దాంతో రక్తం గడ్డకట్టి ఆగిపోతుంది. ఒక్కో సారి ప్రాణాలకే ప్రమాదం జరుగుతుంది. అయితే పరిసరాల పరిశుభ్రత, ముందు జాగ్రత్త చర్యలతో దీనికి చెక్ పెట్టవచ్చు.