ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు దుస్తువులు లేకున్నా అందంగానే ఉంటారంటూ వివాదస్ప వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో నిర్వహించిన యోగా సైన్స్ క్యాంప్ లో భాగంగా రామ్ దేవ్ బాబా ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సమావేశంలో భాగంగా మహిళలు చేసిన యోగా శిక్షణ కార్యక్రమం ముగిసిన వెంటనే ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్, సీఎం ఏక్ నాథ్ షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే తదితరలు పాల్గొన్నారు. రామ్ దేవ్ బాబా మహిళల వస్త్రాధరణపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా మండిపడ్డారు.
మీడియాతో నారాయణ మాట్లాడుతూ..”యోగాను మార్కెటింగ్ చేసే రామ్ దేవ్ బాబా.. మహిళల గురించి చాలా అన్యాయంగా మాట్లాడారు. అతడు అలా మాట్లాడినందుకు అక్కడ ఉన్న మహిళే స్పందించి ఉండాల్సింది. అతడిపై చర్యలు తీసుకోని ఉండాలి లేదా అతడి చెప్పుతో కొట్టాలి. మహిళలు నగ్నంగా ఉంటే బాగుంటారు అని అన్నాడు అంటే.. అతడ్ని మించిన స్త్రీ వ్యతిరేకి ఎవరూ ఉండరు. మహిళ వ్యతిరేక చట్టం కింద అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. యోగాను కార్పొరేట్ వ్యవస్థగా మార్చి..పతంజలి పేరుతో వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు” అని నారాయణ విమర్శించారు.
మహారాష్ట్రలో నిర్వహించిన యోగా సైన్స్ క్యాంప్ లో ముఖ్య అతిథిగా రామ్ దేవ్ బాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ దేవ్ బాబా మాట్లాడుతూ.. మహిళలు చీరలు, సల్వార్ సూట్స్ లు ధరించిన బాగుంటారని రామ్ దేవ్ బాబా అన్నారు. ఇంతటితో ఆగక బాబా.., మహిళలు తన లాగా దుస్తువులు లేకున్నా కూడా అందంగానే ఉంటారంటూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. రామ్ దేవ్ బాబా ఈ విధమైన వ్యాఖ్యలు చేయడంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. స్త్రీల పట్ల ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా రామ్ దేవ్ బాబా అసలు క్యారెక్టర్ బయటపడిందని మండిపడ్డారు.