డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొందరు రేయింబవళ్లు కష్టపడి ధనం సంపాదింస్తుటారు. కానీ కొందరు మాత్రం అడ్డదారులో డబ్బులు పొందేందుకు అనేక అడ్డదారులను ఎంచుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీస్ లోని కొందరు ఉద్యోగులు నకిలీ పత్రాలు సృష్టించి.. ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి 279 మందిని చనిపోయినట్లు నకిలీ పత్రాలను సృష్టించి.. ప్రభుత్వ ఖజానాను నుంచి రూ.11.26 కోట్లు కొల్లగొట్టాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
గుజరాత్ రాష్ట్రం సూరత్ జిల్లాలోని ఓ మండలంలో సచిన్ అనే వ్యక్తి క్లర్క్ గా పనిచేస్తున్నాడు. అక్కడ చాలా ఏళ్లుగా పనిచేస్తూ ఉండటంతో రెవెన్యూ శాఖకు సంబంధించి కీలక విషయాలపై పట్టు సాధించాడు. అలానే ఏ ఏ పరిస్థితులో ప్రభుత్వ సొమ్ము ప్రజలకు చేరుతుందనే విషయాలపైన, పథకాలపైన సచిన్ బాగా అవగాహన చేసుకున్నాడు. నీటిలో మునిగిపోవడం, పిడుగుపాటు, పాము కాటు లేదా ఇతర కారణాల వల్ల ఏ వ్యక్తి అయినా మరణిస్తే.. రెవెన్యూ శాఖలోని రిలీఫ్ బ్రాంచ్ నుంచి..బాధిత కుటుంబానికి రూ.4 లక్షలు వస్తాయి. ఈ విషయాని తెలుసుకున్న సచిన్ కి ఓ కన్నింగ్ ఆలోచన వచ్చింది. బతికున్న వారిని చనిపోయినట్లు నకిలీ పత్రాలను, వాటికి సంబంధించిన వివరాలను సృష్టించాడు.
వాటిని సంబంధిత వెబ్ సైట్ లో అప్లోడ్ చేసి కొత్త స్కామ్ కు తెరతీశాడు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 279 మందిని చనిపోయినట్లు దొంగ పత్రాలను సృష్టించాడు. వాటి ద్వారా మొత్తం 40 బ్యాంక్ ఖాతాల నుంచి రూ.11.26 కోట్లు దోపిడి చేశాడు. ఇంకా మరికొంత డబ్బులు సంపాదించే పనిలో సచిన్ ఉన్నాడు. అయితే సచిన్ పనిచేస్తోన్న రెవెన్యూ కార్యాలయంపై ఉన్నతాధికారులకు అనుమానం కలిగింది. అక్కడ కొన్ని అవకతవకలు జరిగినట్లు వారు భావించి.. సంబంధిత అధికారులతో తనిఖీలు నిర్వహించారు. అధికారులు ఆడిట్ చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న సచిన్.. ఆఫీస్ కి రావడం మానేశాడు. దీంతో అతడి అల్మార్ లో కూడా అధికారులు సోదాలు చేశారు. ఈక్రమంలో నగదుకు సంబంధించిన కొన్ని అఫ్రూవల్ డాక్యూమెంట్స్ కనిపించాయి. వాటిని పరిశీలించిన అధికారులు కంగుతిన్నారు. అర్హత లేని వారి ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ అయినట్లు గమనించారు.
నిందితుడు 8 వేర్వేరు బ్యాంకులకు చెందిన 40 ఖాతాల ద్వారా రూ.11.26 కోట్లను సంపాదించినట్లు అధికారులు తెలిపారు. ఆర్డర్ లోని లెటర్ హెడ్, సీల్, సంతకం అన్నీ నకిలీవేనని చెప్పారు. సచిన్ కు సంబంధించిన ఇతర పత్రాలను కూాడా అధికారులు తనిఖీ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి హస్తం అయినా ఉందా ? అనే విషయాలపై ఆరా తీసుకున్నారు.