ఓటు విలువ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి తెలుసు. కానీ ఆ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే బద్ధకం. ఇది తెలియక చేస్తున్నారేమో ఆనాడకి కాదు, అన్నీ తెలిసినవాళ్లు, విద్యావంతులు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. అలాంటి వారందరికీ ఈ నవవధువే ఆదర్శం..
దేశంలో ఉన్న ప్రతి పౌరుడి అస్తిత్వానికి ఓటు హక్కు ప్రతీక. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సమాజం పురోగతి సాధించాలన్నా, మనం బాగుపడాలి అన్నా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. అంతేకాదు, దేశ స్థితిగతులను మార్చే శక్తి ఒక్క ఓటుకు మాత్రమే ఉంటుంది. కానీ చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తూ.. ఓటేయడానికి నిరాకరిస్తుంటారు. అలాంటి వారందరు ఈమెను చూసి ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. మరికొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకొని, నవసమాజ నిర్మాణం కోసం తనవంతుగా ఓటు హక్కు వినియోగించుకుంది.. ఓ నవవధువు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదిలావుంటే, అందంగా ముస్తాబై ఉన్నఓ నవవధువు ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడం పోలింగ్ బూత్ లో ఉన్న అధికారులను ఆశ్చర్యపరిచింది. ఈ అరుదైన దృశ్యం చిక్కమగళూరు జిల్లాలోని ముదిగేరే అసెంబ్లీ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. మకొనహలి గ్రామానికి చెందిన ఓ యువతి పెళ్లి దస్తుల్లో అందంగా ముస్తాబై పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేసింది. ఆ దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.
చూశారుగా, నవభారత నిర్మాణం కోసం నవవధువు తీసుకున్న నిర్ణయం. కొందరు అమ్మాయిలు, కాసేపట్లో పెళ్లి అంటే ఎక్కడ మేకప్ పోతుందో అని బయటకి కూడా రారు. అలాంటిది మరికొన్ని గంటల్లో పెళ్లి ఉండగా.. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసిన వధువు ఓటేయడాన్ని ఎన్నికల అధికారులు అభినందించారు. కాగా ముదిగేరే నియోజకవర్గంలో బీజేపీ నుంచి దీపక్ దొడ్డయ్య, జేడీఎస్ ఎంపీ కుమారస్వామి, కాంగ్రెస్ నుంచి నయన జ్యోతి ఝవార్ మధ్య పోటీలో నిలిచారు. ఈ నవవధువుపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరికొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకొని సమాజం కోసం బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకున్న నవవధువు..#KarnatakaAssemblyElection2023 #Chikmagalur pic.twitter.com/d3wt4lR8DM
— Muskmelon (@gova3555) May 10, 2023