ఈ మద్య దేశ వ్యాప్తంగా బాంబు దాడులు విపరీతం అవుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నేతలను టార్గెట్ చేసుకొని ప్రత్యేర్థులు వారిపై కాల్పులు జరపడం.. బాంబు దాడులు చేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
ఈ మద్య దేశ వ్యాప్తంగా గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. లైసెన్స్ లేని గన్స్ తో కొంతమంది దుండగులు హల్ చల్ చేస్తున్నారు. ఇక బాంబు దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రాజకీయ నేతలు, వారి బంధువులను టార్గెట్ చేసుకొని వారి ప్రత్యర్థులు బాంబుదాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి దాడుల్లో అమాయకులు కూడా చనిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఓ రాజకీయ నేత తనయుడిపై ప్రత్యర్థులు బాంబు దాడి చేయడం కలకలం సృష్టించింది. ఈ ఘటన అలహాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ అలహాబాద్ జిల్లా ఝాన్సీ పరిధిలోని గంగపర్ ప్రాంతానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా నేత విజయలక్ష్మి సింగ్ చందేల్ కుమారుడు గురువారం ఓ కార్యక్రమంలో భాగంగా తన బంధువుల ఇంటికి వెళ్లాడు. మార్గ మద్యలో కొంతమంది దుండగులు వచ్చి కారును ఆపారు. ఆ తర్వాత రెండు ద్విచక్రవాహనాలపై వచ్చిన దుండగులు వెంట వెంటనే కారుపై బాంబులు విసిరి వెళ్లారు. అదృష్టం కొద్ది ఈ దాడిలో విజయలక్ష్మి సింగ్ చందేల్ కుమారుడికి ఏమీ కాకోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. నడిరోడ్డులో కారుపై దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
తన కొడుకుపై బాంబులతో దాడి చేసింది పోలీస్ కానిస్టేబుల్ శివం బచ్చన్ యాదవ్ కుమారుడు శివం యాదవ్ అని బీజేపీ నాయకురాలు విజయలక్ష్మి సింగ్ చందేల్ ఆరోపించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు విజయలక్ష్మి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. ఇటీవల ఉమేశ్ పాల్ హత్య మరువక ముందే ఇలా బాంబు దాడి ఘటన ఆ జిల్లాలో తీవ్ర కలకలం సృష్టిస్తుంది.