ఇటీవల దేశంలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. అయితే మహిళలే కాదు.. పురుషులు సైతం గృహహింసకు గురవుతున్నారని ఇటీవల పలు సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.
దేశంలో ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు రెచ్చిపోతున్నారు. ఒకదశలో మహిళలు ఒంటరిగా బయట తిరిగే పరిస్థితి లేదని పెద్ద ఎత్తు ఆందోళనలు చేస్తున్నారు మహిళా సంఘాలు. పెళ్లైన తర్వాత భార్యను చిత్ర హింసలకు గురి చేసని భర్తలకు సంబంధించి ఎన్నో వార్తలు వస్తున్నాయి.. ఇటీవల గృహ హింస చట్టం వచ్చిన తర్వాత ఈ ఆగడాలకు కాస్త అడ్డుకట్ట వేసినట్టయ్యింది. అయితే మహిళలే కాదు.. పురుషులు సైతం గృహ హింసకు గురవుతున్నారని ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా తన భార్య తనను చిత్ర హింసలకు గురి చేస్తుందని.. తన కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ భర్త. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల భార్యల చేతుల్లో ఇబ్బందులు పడుతున్న భర్తలు పోలీసు మెట్లు ఎక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గృహహింస చట్టం అడ్డు పెట్టుకొని కొంత మంది మహిళలు తమ భర్తలను టార్చర్ పెడుతున్నారని అంటున్నారు. తమపై పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారని, మగాళ్లపై సాగే వేధింపులు బయట ఎవరికీ కనిపించవని.. తమ గోడు ఎవరికీ చెప్పుకోలేక భార్యలు పెట్టే వేధింపులను మౌనంగా భరిస్తున్నారని అంటున్నారు భార్యాబాధితులు. కానీ.. ఓ భర్త తన భార్యలు పెట్టే హింసలు భరించలేకపోయాడు.. ఎంత సర్ధి చెప్పినా తన మాట లేక్క చేయకపోవడంతో చివరికి పోలీస్ స్టేషన్ లో భార్యపై ఫిర్యాదు చేశాడు.
బెంగళూరు బసవగూడకు చెందిన ఓ వ్యక్తి పెళ్లైనప్పటి నుంచి తన భార్య తన మాట వినడం లేదని.. ఇంట్లో ఒక్క పనికూడా చేయడం లేదని మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిద్రపోతుందని.. ఒకవేళ లేపాలని చూస్తే చిరాకు పడటం.. తిట్టడం లాంటివి చేస్తుందని వాపోయాడు. అంతేకాదు ఇంట్లో తన భార్య వంట కూడా చేయడం లేదని.. తప్పని సరి బయట తినాల్సి వస్తుందని అన్నాడు. వయసు మీద పడ్డ తన తల్లిని కూడా సరిగా చూసుకోవడం లేదని.. తన తల్లే తనకు వండిపెడుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు వీటన్నింటిని భరించామని.. ఈ మద్య తమ కుటుంబ సభ్యులపై దాడికి చేయడం ప్రారంభించిందని అన్నాడు. తన భార్యను భరించడం తనకు, తన కుటుంబ సభ్యులకు భారంగా మారిందని.. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కమ్రాన్ ఖాన్ తెలిపాడు.