ఫ్లాష్ ఫ్లాష్: అమెరికాలోని 9/11 దాడి తరహాలో లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చివేస్తామని బెదిరింపు కాల్ రావడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. ఢిల్లీ విమానాశ్రయాన్ని తాము స్వాధీనం చేసుకుంటామని గుర్తుతెలియని వ్యక్తులు ఢిల్లీ పోలీసులకు బెదిరింపు కాల్ చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు. ఓ ఆగంతకులు ఫోన్ చేసినట్టు ఢిల్లీ విమానాశ్రయం డీసీపీ రాజీవ్ రంజన్ తెలిపారు. వెంటనే సంబంధిత ఏజెన్సీలన్నింటికీ సమాచారం అందించారు. ఢిల్లీ- పాట్నా విమానంలో ఉన్న 52 మంది ప్రయాణీకుల్ని మరో విమానానికి తరలించి విస్తృతంగా తనిఖీలు చేశారు.
బాంబు బెదిరింపు కాల్ రాత్రి ఢిల్లీలోని రహోలా పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నామని ఢిల్లీ డీసీపీ ప్రతాప్ సింగ్ ట్వీట్ చేశారు. విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కాల్సిన వారు ఆలస్యం చేయకుండా ముందుగా రావాలని డీసీపీ ప్రయాణికులకు సూచించారు. బెదిరింపు నేపథ్యంలో విమానాశ్రయంలో అన్ని ప్రాంతాలను భద్రతాధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సంఘటనపై మాట్లాడిన ఎయిర్ పోర్ట్ డిసిపి రాజీవ్ రంజన్ ఈరోజు ఉదయం 7.45 గంటలకు ఢిల్లీ నుండి పాట్నాకు ప్రయాణిస్తున్న విమానం లోపల బాంబు ఉందని కాల్ వచ్చిందని , మేము వెంటనే అన్ని సంబంధిత ఏజెన్సీలకు సమాచారం ఇచ్చామని వెల్లడించారు.