విమాన ప్రయాణం చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. విమాన సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకర్షిస్తుంటాయి. అయితే అప్పుడప్పుడు విమానాలు ప్రమాదాలకు గురవుతూ ప్రయాణికులను కలవరపెడుతుంటాయి.
విమాన ప్రయాణం చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. విమాన సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకర్షిస్తుంటాయి. అయితే అప్పుడప్పుడు విమానాలు ప్రమాదాలకు గురవుతూ ప్రయాణికులను కలవరపెడుతుంటాయి. ఫ్లైట్స్ సాంకేతిక కారణాలతో లేదా మానవ తప్పిదాలతో ప్రమాదాలకు గురవుతుంటాయి. కారణం ఏదైనా ప్రమాదం మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ విమానాశ్రయంలో పెనుప్రమాదం తప్పింది. రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డారు ప్రయాణికులు. ఏటీసీ అధికారుల తప్పిదంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ తర్వాత అప్రమత్తమైన సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో విస్తారా ఎయిర్ లైన్స్ కు చెందిన రెండు విమానాలు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాయి. ఏటీసీ అధికారులు ఒకే సమయంలో రెండు విమానాలకు ల్యాండింగ్, టేకాఫ్ కు అనుమతి ఇవ్వడంతో ఈ పరిస్థితి తలెత్తింది. చివరి క్షణంలో టేకాఫ్ ను ఆపివేయడంతో ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి బగ్‌దోరాకు వెళ్తున్నవిమానం యూకే725 టేకాఫ్ తీసుకోనుండగా, అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానం ల్యాండింగ్ కావాల్సి ఉంది. ఒకేసారి రెండు విమానాలకు ఏటీసీ అధికారులు అనుమతి ఇవ్వడంతో రన్‌వేపై ఆ రెండు విమానాలు ఢీకొనే పరిస్థితి చోటుచేసుకుంది. ఏటీసీ అధికారుల అప్రమత్తమై టేకాఫ్ ను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.