“వినా స్త్రీ జననం నాస్తి.. వినా స్త్రీ గమనం నాస్తి.. వినా స్త్రీ సృష్టే నాస్తి” అని అందరికీ తెలుసు. అంటే స్త్రీ లేనిదే జననం లేదు. స్త్రీ లేనిదే గమనం లేదు. స్త్రీ లేనిదో ఈ సృష్టే లేదు. “యత్ర నార్యస్తు పూజ్యంతే.. రమంతే తత్ర దేవతాః!” అంటే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో.. ఎక్కడ స్త్రీలు సముచిత స్థానాన్ని పొందుతారో అక్కడ దేవతలు ఉంటారని ప్రసిద్ధి. ఇలాంటి మాటలు మనం ఫేస్‌బుక్‌లో చూస్తుంటాం, పుస్తకాల్లో చదువుతుంటాం, మాతృదినోత్సం, బాలికల దినోత్సవం రోజు స్టేటస్సుల్లో కూడా పెడుతుంటాం. కానీ, మన ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే జీర్ణించుకోలేం(ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి). ప్రస్తుతం చాలా వరకు ప్రజల్లో చైతన్యం వచ్చిందనే చెప్పాలి. కానీ, ఇప్పటికీ ఆడశిశులను రక్షించడం కోసం, వారి సంఖ్యను పెంచడం కోసం ప్రభుత్వాలు కృషి చేయక తప్పడం లేదు.
ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అలాంటి కార్యక్రమాలను చేస్తూనే ఉంటాయి. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే డాక్టర్ గురించి అయితే ఎవరికీ తెలియకపోవచ్చు. ఆడశిశువులను రక్షించేందుకు ఆయన చేస్తున్న సేవ, కృషి ఎంతో మందికి తెలియాలి కూడా. ఆ ప్రాతంలో అమ్మాయి పుడితే చూడటానికి కూడా వచ్చేవాళ్లు కాదు. అమ్మాయి అనే అనుమానం వచ్చినా అబార్షన్ చేయించే వాళ్లు. అలాంటి ప్రాంతంలో ఈ వైద్యుడు చేసిన కృషితో పరిస్థితులు మారిపోయాయి. ఆ వైద్యుడి పేరు గణేశ్ రఖ్. ఆయనకు మహారాష్ట్రలోని హరిదాప్సార్ ప్రాంతంలో ఆయనకు ఓ ఆస్పత్రి ఉంది. అక్కడే ఆయన ఆడశిశువుల సంరక్షణ కోసం కృషి చేస్తుంటారు.
గణేశ్ రఖ్ ఆస్పత్రిలో ఆడశిశువుకు జన్మనిస్తే వారికి ఘనమైన స్వాగతం పలుకుతారు. అలాగే ఆడశిశువుకు జన్మనిచ్చిన ఆ మహిళ నుంచి గానీ, వారి కుటుంబం నుంచి గానీ, ఒక్క రూపాయి తీసుకోరు. అంటే ఆడపిల్లకు జన్మనిస్తే అక్కడ ప్రసవం పూర్తిగా ఉచితం అనమాట. “బేటీ బచావో జనాందోళన్” కార్యక్రమంలో భాగంగా ఈ వైద్యుడు ఆడశిశువులకు ఉచిత ప్రసవాలు చేస్తున్నారు. అలా గత 11 ఏళ్లలో గణేశ్ రఖ్ ఆస్పత్రిలో 2,400 ఉచిత ప్రసవాలు చేశారు. 2012కు ముందు ఆ ప్రాతంలో భ్రూణ హత్యలు ఎక్కువగా జరిగేవని గణేశ్ రఖ్ తెలిపారు. అమ్మాయి పుడితే ఆ శిశువును చూసేందుకు, ఆ మహిళ కోసం కూడా ఎవరూ వచ్చేవారు కాదని తెలిపారు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు మారాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.