భారత రాజ్యాంగం ఏర్పాటు చేసిన వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ ఒకటి. పక్షపాత ధోరణి లేకుండా న్యాయన్నందించే స్వేచ్ఛ న్యాయమూర్తులకు ఉంటుంది. మిగిలిన రాజ్యాంగ వ్యవస్థలైనా శాసన, కార్యనిర్వాహక శాఖ ఒత్తిళ్లకులోను కాకుండా వీరిచ్చే తీర్పులు, జారీ చేసే ఉత్తర్వులు ఉంటాయి. ఓ న్యాయమూర్తిని తొలగించాలంటే పార్లమెంట్ లోని ఉభయ సభల్లో 2/3 మెజార్టీ అవసరం. అందుకే దేశంలో న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలు నమ్మకాన్ని వ్యక్తం చేస్తారు.
న్యాయమూర్తి కావాలంటే న్యాయ శాస్త్ర పట్టాభద్రులు కావడంతో పాటు న్యాయవాదిగా అపార అనుభవం ఉండాలి. వీటితో పాటు సాధించాలన్న తపన ఉండాలి. ఆ తపనే ఎన్. గాయత్రి అనే యువతిని 25 ఏళ్లకే న్యాయమూర్తిగా నియమితులయ్యేలా చేసింది. కర్ణాటకలోని కోలారు సివిల్ కోర్టు న్యాయమూర్తిగా ఆమె అవకాశాన్ని దక్కించుకున్నారు. బంగారు పేట తాలూకా యళబుర్గికి చెందిన గాయత్రి కడు పేదరికంలో పుట్టారు. నారాయణ స్వామి, వెంకటరత్నమ్మలకు ఆమె ఒక్కరే కుమార్తె. వీరి కుటుంబం ఇప్పటికీ అద్దె ఇంట్లోనే నివసిస్తోంది. తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లి గాయత్రిని చదివించారు.
గాయత్రి కారహళ్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. కోలారు మహిళా కళాశాలలో బీకాం చదివారు. 2021లో కెజీఎఫ్ లోని కెంగల్ హనుమంతయ్య లా కాలేజ్ లో న్యాయ విద్యను పూర్తి చేశారు. విశ్వవిద్యాలయ స్థాయిలో ఆమె నాల్గవ ర్యాంకు సాధించారు. ఆ ఏడాదిలో సివిల్ న్యాయమూర్తి పోస్టులకు నిర్వహించిన ఇంటర్వ్యూలో విఫలమైనా.. రెండో ప్రయత్నంలో ఆమె విజయం సాధించారు. సీనియర్ న్యాయవాది శివరాం సుబ్రహ్మణ్యం వద్ద ఆమె జూనియర్ న్యాయవాదిగా పనిచేశారు. ఆయనే తనను గైడ్ చేశారని ఈ సందర్భంగా గాయత్రి కృతజ్ఞతలు తెలిపారు. అనుకుంటే సాధించలేనిదీ ఏదీ లేదని నిరూపించిన గాయత్రి స్టోరీపై మీ కామెంట్ల రూపంలో తెలపండి.