ఫిల్మ్ డెస్క్- ఎస్ ఎస్ రాజమౌళి.. ఈ దర్శకధీరుడి డైరెక్షన్ లో నటించాలని స్టార్ హీరోలు, నటీ నటులు ఉవ్విళ్లూరుతుంటారు. కనీసం ఒక్క సినిమాలోనైనా ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటారు. ఇక అభిమానులైతే తమ అభిమాన హీరో, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రావాలని అడుగుతుంటారు. ఇదిగో ఇటువంటి సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి సినిమా అంటే ఇక చెప్పేదేముంది.
రాజమౌళి, మహేష్ బాబు సినిమాపై అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఏదైతేనేమి ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కబోతోంది. పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ విడుదలై పరిస్థితులు చక్కబడితే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్తుందట.
ప్రముఖ స్టార్ రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే మహేష్ బాబు కోసం ఓ కథను రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఇంట్రస్టింగ్ స్టోరీని ప్లాన్ చేస్తోన్నట్టు సమాచారం. ఈ మూవీలో అడ్వెంచర్లు ఎక్కువగా ఉండబోతోన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. కధ, స్క్రిప్ట్ కు విజయేంద్రప్రసాద్ తుది మెరుగులు దిద్దుతున్నారని తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమా గురించి సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ స్పందించారు. క్రేజ్ కాంబినేషన్ అయిన రాజమౌళి అన్న, మహేష్ బాబు సినిమాకు ఆల్ ది బెస్ట్ ప్రసాద్ నాన్న గారు.. ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.. అని ఎంఎం శ్రీలేఖ ఓ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలో విజయేంద్ర ప్రసాద్ తన కలానికి పదును పెడుతున్నట్లు కనిపిస్తోంది. అన్నట్లు మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నారు.