సింగపూర్- కృషి.. పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధించవచ్చంటారు. అందుకే కృషి ఉంటే మునుషులు రుషులవుతారని అన్నారో కవి. నిజమే మరి నిజాతీగా కృషి చేస్తే ఏరంగంలోనైనా అనుకున్నది సాధించవచ్చు. అలా ఎంతో మంది సాధించి చూపించారు కూడా. ఇప్పుడు మన తెలుగు అమ్మాయి ఇలాగే కృషి చేసి తాను అనుకున్నది సాధించింది. అది కూడా సింగపూర్ లో.
అవును శ్రీకాకుళం అమ్మాయి ఏకంగా సింగపూర్ కిరీటం దక్కించుకుంది. 21 ఏళ్ల బాన్న నందిత మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 కిరీటం గెలుచుకుంది. ఆరు నెలలుగా వివిధ అంశాల్లో జరిగిన పోటీల తర్వాత మొత్తం ఆరుగురిని తుది దశకు ఎంపిక చేశారు నిర్వాహకులు. చివరికి నిర్వాహకులు అడిగిన ప్రశ్నలకు సమర్థంగా సమాధానాలిచ్చిన నందితకు మిస్ సింగపూర్ టైటిల్ దక్కింది. ముందు నుంచీ మోడలింగ్ పై ఇష్టంతో కృషి చేసిన నందిత మిస్ యూనివర్స్ సింగపూర్ పోటీలో నిలిచి కిరీటం గెలుచుకుంది.
శ్రీకాకుళం నగరంలోని చిన్నబజారులోని దూదివారి వీధి నందిత స్వస్థలం. ఇక్కడ ఇప్పటికీ ఆమె కుటుంబానికి సొంతిల్లు ఉంది. నందిత తండ్రి బాన్న గోవర్ధనరావు, తల్లి ఫణి మాధురి 25 ఏళ్ల క్రితం సింగపూర్‌లో స్థిరపడ్డారు. వీళ్లిద్దరూ సంగపూర్ లో సివిల్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. గోవర్ధనరావు ఏవియేషన్ సప్లయ్ చెయిన్ సీనియర్ మేనేజర్‌గా పని చేస్తుండగా, మాధురి మరో కంపెనీలో సివిల్ ఇంజినీరుగా పని చేస్తున్నారు.
సింగపూర్ లో నందిత చాలా ఫ్యాషన్ పోటీల్లో పాల్గొన్నారు. మరోవైపు చదువులోనూ ఆమె ప్రతిభ కనబరుస్తోంది. నందిత ప్రస్తుతం మేనేజ్ మెంట్ కంప్యూటర్ సైన్స్‌లో డ్యూయల్ డిగ్రీ చదువుతోంది. ఇక మిస్ యూనివర్స్ సింగపూర్-2021 కిరీటాన్ని దక్కించుకోవడం పట్ల నందిత సంతోషం వ్యక్తం చేసింది. వచ్చే డిసెంబర్‌లో ఇజ్రాయిల్‌లో జరిగే మిస్ యూనివర్స్ పోటీల్లో కూడా పాల్గొంటున్నట్లు ఆమె చెప్పారు. మిస్ యూనివర్స్ కిరీటాన్ని సైతం దక్కించుకుంటానని నందిత ధీమా వ్యక్తం చేసింది.