తెలంగాణ క్రైం డెస్క్- ఈ రోజుల్లో మానవ సంబంధాలు పక్కదారి పడుతున్నాయి. డిజిటల్ ప్రపంచంలో చాలా మంది పైపై మెరుగులకు ఆకర్షితులవుతున్నారు. కుటుంబంలోని బాంధవ్యాలకు బీటలు వారి.. బంధాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ప్రధానంగా మగ, ఆడ విషయంలో ప్రస్తుత సమాజంలో వీపరీత ధోరణులు కనిపిస్తున్నాయి. జీవితాంతం తోడుండే ప్రేమను కాదనుకుని తాత్కాలికమైన ఆనందం కోసం చాలా మంది పెడదారి పడుతున్నారు. ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ మహిళ చేసిన పని చర్చనీయాంశమవుతోంది. పెళ్లై, బంగారం లాంటి మొగుడు, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు ఉన్న మహిళ, పెళ్లి కాని యువకుడి మోజులో పడి ఆతనితో వెళ్లిపోవడం కలకలం రేపుతోంది. ఆసక్తికరమైన ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది.
వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన సుజాత అనే మహిళకు పన్నెండేళ్ల క్రితం పెళ్లైంది. ఆమెకు భర్త, పదేళ్ల వయసున్న కొడుకు, ఏడేళ్ల వయసున్న కూతురు ఉన్నారు. అంతా సజావుగా సాగుతున్న వారి కాపురంలోకి రాకేశ్ అనే యువకుడు ప్రవేశించాడు. అమరచింతలో సుజాత కుటుంబం నివసించే కాలనీకి చెందిన రాకేశ్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా, ఆ తరువాత కొంత కాలానికి ప్రేమగా మారింది. అతి తక్కువ సమయంలోనే ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చారు. సుజాత భర్త లేని సమయంలో ఇద్దరు తీరిగ్గా కలుసుకునే వారు. ఇక ఎన్నాళ్లిలా చాటు మాటుగా కలుసుకుంటామని అనుకున్నారో ఏమో.. ఎక్కడికైనా వెళ్లి కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు సుజాత, రాకేశ్ లు.
అనుకున్నదే తడవుగా ప్రియుడు రాకేశ్ కోసం సుజాత భర్త, పిల్లల్ని వదిలేసింది. సరిగ్గా నెల రోజుల క్రితం హఠాత్తుగా రాకేశ్‌తో ఇంటి నుంచి వెళ్లిపోయింది. చుట్టుపక్కల ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా గుర్తు పడతారని చెప్పి ఏకంగా వరంగల్ కు వచ్చేశారు. అక్కడ తామిద్దరం భార్యా భర్తలమని చెప్పి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టేశారు. ఇక నెలరోజులుగా వాళ్లిద్దరి కోసం ఇరు కుంటుంబాలు అన్ని చోట్లా వెతుకుతున్నారు. చివరికి సుజాత, రాకేశ్ లు వరంగల్‌లో ఉంటున్నట్లు తెలుసుకుని.. అక్కడికి వెళ్లి, ఇద్దరికి సర్ధి చెప్పి అమరచింతకు తీసుకువచ్చారు. సుజాతను భర్త ఇంటికి పంపించేసి, రాకేశ్ ను వారితో తీసుకెళ్లారు అతని బంధువులు.
ఐతే సుజాత ప్రియుడిని వదిలి ఉండలేకపోయింది. అమరచింత పోలీస్స్టేషన్‌కు వచ్చి తనకు తన ప్రియుడు రాకేశ్ కావాలని నిరసన తెలిపింది. తామిద్దరం వరంగల్ వెయ్యి స్తంభాల గుడిలో పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చింది. రాకేశ్‌పై, తనపై వాళ్ల కుటుంబసభ్యులు దాడి చేశారని, రాకేశ్‌ను ఎక్కడ దాచి పెట్టారో చెప్పాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఐతే తమకు అమ్మ కావాలని అమె పిల్లలిద్దరు అడ్వడం అందరిని కదిలిస్తోంది. ఐనా ఇవేమి పట్టించుకోని సుజాత.. తనకు రాకేశ్ కావాలని పట్టుబట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విషయం తెలిసిన బంధువలంతా కలికాలం అంటే ఇదే మరి అని వ్యాఖ్యానిస్తున్నారు.